వైద్యులపై సర్కార్ నజర్.. ఆరోగ్యశాఖ చేతిలో వారి జాబితా!

by Anukaran |   ( Updated:2021-08-25 21:39:36.0  )
వైద్యులపై సర్కార్ నజర్.. ఆరోగ్యశాఖ చేతిలో వారి జాబితా!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇక నుంచి సర్కార్ దవాఖాన్లలో పనిచేసే డాక్టర్ల పనితీరుపై ప్రభుత్వం దృష్టిసారించనుంది. విధులకు సరిగ్గా హాజరుకాకపోయినా, పనితీరు మెరుగ్గా లేని వారిని పల్లెలకు పంపించాలని సర్కార్ యోచిస్తోన్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి టీచింగ్ హాస్పిటల్స్ వరకు ప్రతీ డాక్టర్ పై నజర్ కొనసాగనుంది. ఇటీవల కేబినేట్ సబ్ కమిటీ మీటింగ్‌లోనూ ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. దీని విధివిధానాలను తయారు చేయాలని మంత్రి వర్గం ఉప సంఘం వైద్యారోగ్యశాఖను సూచించింది. దీంతో డాక్టర్ల ఫర్మామెన్స్ షీట్‌ను తయారు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. అయితే ప్రభుత్వాసుపత్రుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొందరి డాక్టర్లను ఇప్పటికే గుర్తించామని, జాబితాను కూడా సిద్ధం చేస్తున్నట్లు సెక్రటేరియట్‌లోని ఓ వైద్యాధికారి ‘దిశ’కు తెలిపారు. అతి త్వరలో ఆ ఫర్మామెన్స్ షీట్ విధివిధానాలను కూడా ఖరారు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఎందుకు ఈ నిబంధన..?

సర్కార్ దవాఖాన్లలో పనిచేసే కొందరు వైద్యులు డ్యూటీలకు సరిగ్గా రావడం లేదని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. విధులు కంటే వారి పర్సనల్ పనులు, సొంత క్లినిక్, హాస్పిటళ్ల అభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్వయంగా ప్రజాప్రతినిధులు కంప్లైంట్స్ చేశారు. కొన్ని ఆసుపత్రుల్లో నెలల తరబడి విధులకు రాని వారు కూడా ఉన్నట్లు కేబినేట్ సబ్ కమిటీ మీటింగ్‌లో చర్చ జరిగింది. స్వయంగా మంత్రుల నుంచి ఈ ఫిర్యాదులు రావడంతో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మరోవైపు జిల్లా హాస్పిటళ్లు, ఏరియా హాస్పిటళ్లు, టీచింగ్‌ హాస్పిటల్స్‌లో వేల మంది డాక్టర్లు ఉన్నా, పేషెంట్లకు సరైన సమయంలో వైద్య సేవలు అందకపోవడానికి కారణాలు ఏంటన్న దానిపై కేబినేట్ సబ్ కమిటీ తీవ్ర అసంతృప్తిని వ్యక్త పరిచింది.

అంతేగాక దేశ వ్యాప్తంగా ఏ రాష్ర్టంలో లేని విధంగా డాక్టర్లకు వేతనాలు చెల్లిస్తున్నా, ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉన్నదని కేబినేట్ సబ్ కమిటీ అధికారులను ప్రశ్నించింది. దీంతో సీఎం సూచన మేరకు ఫర్మామెన్స్ షీట్ విధానాన్ని అమల్లోకి తేబోతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. దీని ద్వారా ప్రతీ హాస్పిటల్, దానిలో పని చేసే డాక్టర్ల మంత్లీ రిపోర్టులను తయారు చేయనున్నారు. దీంతో పాటు బయోమెట్రిక్, అటెండెన్స్ విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఆరోగ్యశాఖ ఆలోచిస్తున్నది. ఈ మేరకు సాంకేతిక అంశంలో రాష్ర్ట ఐటీ శాఖ సహయాన్ని కూడా తీసుకోనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

సంవత్సరంలో జరిగిన సర్జరీలు అక్కడ నెల కంటే తక్కువట…

గాంధీ హాస్పిటల్‌లోని కార్డీయాలజీ విభాగంలో పని చేసే ఓ ప్రొఫెసర్‌‌ సంవత్సరం మొత్తం మీద చేసిన సర్జరీలు, నిమ్స్‌లో ఓ డాక్టర్ నెల రోజుల్లో చేసిన సర్జరీల కంటే తక్కువగా ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ గుర్తించింది. దీంతో పాటు నిలోఫర్, ఉస్మానియా, ఎంజీఎంతో పాటు జిల్లా ఆసుపత్రుల్లోని కొందరి డాక్టర్లదీ ఇదే విధానంలో పనితీరు కొనసాగుతున్నట్లు కేబినేట్ గుర్తించింది. దీనికి కారణాలను పొందుపరుస్తూ ఓ నివేదికను కూడా తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

అక్కడ ఎందుకు ఆసక్తి చూపడం లేదు…

గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు కొందరు డాక్టర్లు ఆసక్తి చూపకపోవడానికి గల కారణాలను అన్వేషించాలని కేబినేట్ సబ్ కమిటీ హెల్త్ ఆఫీసర్లకు సూచించింది. అంతేగాక ఆయా ప్రభుత్వ దవాఖాన్లలో హెల్ప్‌ డెస్కులు ఏర్పాటు చేయడం, శానిటైజేషన్ మెరుగు పర్చడం, పేషెంట్ కేర్ వర్కర్స్‌ను నియమించడంపై కూడా నివేదిక రూపొందించాలని సబ్ కమిటీ ఆదేశించింది. దీంతోపాటు నిమ్స్ తరహాలో ప్రభుత్వ దవాఖాన్లలోనూ సాయంత్రం కూడా ఓపీ నిర్వహించే అంశంపై అభిప్రాయాలు ఇవ్వాలన్నది.

Advertisement

Next Story

Most Viewed