ఐటీ ఉత్పత్తులు, ఔషధ రంగానికి పీఎల్ఐ పథకం అమలు

by Harish |   ( Updated:2021-02-24 07:41:03.0  )
ఐటీ ఉత్పత్తులు, ఔషధ రంగానికి పీఎల్ఐ పథకం అమలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని మరిన్ని రంగాలకు విస్తరిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దిగుమతులను తగ్గించి దేశీయ ఉత్పత్తిని పెంచే విధంగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల ఉత్పత్తులకు రూ. 7,325 కోట్లు, ఔషధ రంగానికి రూ. 15 వేల కోట్లను అందించేందుకు బుధవారం ఆమోదించింది. ‘భారత్‌లో ప్రస్తుతం రూ. 30 వేల కోట్ల విలువైన ల్యాప్‌టాప్‌లు, రూ. 3 వేల కోట్ల విలువైన ట్యాబ్లెట్లు అమ్ముడవుతున్నాయి. వీటిలో 80 శాతానికి పైగా దిగుమతి అవుతున్నాయి. 2014లో దేశంలో మొత్తం ఎలక్ట్రానిక్స్ తయారీ విలువ రూ. 1.9 లక్షల కోట్లుగా ఉండగా, గతేడాదికి ఇది రూ. 5.5 లక్షల కోట్లకు పెరిగిందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. తాజా పీఎల్ఐ పథకం ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో 50 శాతం నియంత్రణ కలిగిన దిగ్గజ కంపెనీలను ఆకర్షించాలని భావిస్తున్నట్టు’ టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.

అదేవిధంగా, దేశీయ ఔషధ పరిశ్రమ ప్రపంచ వాటాలో 3.5 శాతం కలిగి ఉందని, అయితే, కొన్ని హై-ఎండ్ పేటెంట్ మందులు ఇప్పటికీ దిగుమతి చేసుకుంటున్నామని, పీఎల్ఐ పథకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దేశీయ ఔషధ పరిశ్రమ పోటీ పడగలమని ఆయన స్పష్టం చేశారు. కాగా, మొబైల్‌ఫోన్‌ల కోసం పీఎల్ఐ పథకాన్ని గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభించాం. కరోనా వైరస్ ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలు ఈ పథకాన్ని వినియోగించుకునేందుకు ముందుకొచ్చాయి. దీనివల్ల రూ. 1,300 కోట్ల విలువైన పెట్టుబడులు భారత్‌లోకి వచ్చాయని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story