మేం ఆ పనులు చేయం

by Aamani |
మేం ఆ పనులు చేయం
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉపాధిహామీ పథకానికి ఇంజినీరింగ్ శాఖలను అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈజీఎస్ నిధులను ఖర్చు చేసేందుకు పలు ప్రభుత్వ శాఖలను ఈజీఎస్ పనుల్లోకి దింపుతున్నది. కాగా, ఈ నిర్ణయాన్ని వివిధ ప్రభుత్వ శాఖల ఇంజినీర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటివరకు పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ నీటిపారుదల తదితర శాఖల ఇంజినీర్లు ఆయా శాఖలు విడుదల చేసే నిధులతో చేపట్టే పనులను పర్యవేక్షించేవారు. కానీ, తాజాగా సర్కారు ఈ శాఖల ఇంజినీర్లకు ఉపాధి హామీ పథకం కింద ఉన్న నిధులను ఖర్చు చేసే విషయంలో బాధ్యతలు చూడాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇది వివాదానికి కారణమవుతున్నది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా విడుదలయ్యే ఈజీఎస్ నిధుల విషయంలో ఇప్పటివరకు ఒక్క పంచాయతీరాజ్ శాఖ మాత్రమే పాలు పంచుకునేది. ఇక నుంచి ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ శాఖలు కూడా ఇందులో భాగం కావాలని ఇచ్చిన ఉత్తర్వులు చెబుతున్నాయి. తాజా ఉత్తర్వులతో ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు కూడా మంజూరు అవుతున్న పనులకు సంబంధించిన వివరాలను ఎంబీ(కొలతల పుస్తకం)లో రికార్డు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది.

కింది స్థాయి ఉద్యోగుల కింద పని..!

ప్రభుత్వ ఇంజినీర్లు తాము కిందిస్థాయి ఉద్యోగుల దగ్గర ఎలా పని చేస్తామని ఇరిగేషన్, ఆర్అండ్‌బీ ఇంజినీర్లు ప్రశ్నిస్తున్నారు. తాజా నిర్ణయంతో ఈ రెండు శాఖల ఇంజినీర్లు ఉపాధి హామీ కూలీలు చేసిన పనులను పరిశీలించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ విషయం‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీవో‌లకు కూడా తాము సమాధానం చెప్పే పరిస్థితి నెలకొంటుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే తాము డిప్యూటీ ఈఈ, ఈఈ‌లకు మాత్రమే గతంలో జవాబుదారీగా ఉండేవాళ్లమని, తాజాగా ఎంపీడీవో‌లకు కూడా తమ బాధ్యతలు చెప్పవలసి రావడం ఎంత మాత్రం సరికాదని ఇంజినీర్లు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఈజీఎస్ పన్నుల విధానం వాటి రికార్డు ప్రస్తుతం తాము నిర్వహిస్తున్న పనులకు పొంతన ఉండదని చెబుతున్నారు. భవిష్యత్తులో ఈజీఎస్‌లో జరిగే చిన్న చిన్న వివాదాలు, సోషల్ ఆడిట్‌లు తమ మెడకు చుట్టుకుంటాయని ప్రభుత్వ శాఖల ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే పనులు రికార్డు చేసే విధానంలోనూ చాలా తేడాలు ఉంటాయని అంటున్నారు.

నిధుల కొరత లేనట్లు చూపేందుకు..

సర్కారు ప్రభుత్వ శాఖల వద్ద నిధుల లేమి లేనట్లు చూపేందుకు తాజా నిర్ణయం ఉందని పలువురు ఇంజినీర్లు అంటున్నారు. ఈజీఎస్ కింద చేపట్టే పనులు మట్టి పనులతో పాటు, చిన్న చిన్న పనులు మాత్రమే సాగుతాయని ఇరిగేషన్ ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. తమకు అలాంటి పనులు అప్పజెప్పి తమ శాఖల ద్వారా పనులు జరుగుతున్నట్లు చూపాలనుకోవడం సరికాదన్న అభిప్రాయంతో అధికారులు ఉన్నారు. కిందిస్థాయి అధికారులకు తమను బాధ్యులను చేయాలని చూడటం కూడా సరి కాదని చెబుతున్నారు.

ఆ పనులు చేయలేం..

ఈజీఎస్ పనుల బాధ్యతల నుంచి తమను తప్పించాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈనెల 1వ తేదీన సర్కారు విడుదల చేసిన ఉత్తర్వులు తమకు గొడ్డలిపెట్టుగా మారాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు నీటిపారుదలశాఖ ఈ‌అండ్‌సీని కలిసి వారు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమాదేవి, టి.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు తమను ఈజీఎస్ బాధ్యతల నుంచి తప్పించాలని కోరారు.

Advertisement

Next Story