ఉద్యమబాట పట్టిన ఉద్యోగులు.. జగన్ సర్కార్‌కు సీరియస్ వార్నింగ్

by Anukaran |   ( Updated:2021-12-06 22:24:21.0  )
ఉద్యమబాట పట్టిన ఉద్యోగులు.. జగన్ సర్కార్‌కు సీరియస్ వార్నింగ్
X

దిశ, ఏపీ బ్యూరో: ‘ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు ఇవ్వాలని అడిగాం. పీఆర్సీ నివేదిక ఇప్పటికీ ఇవ్వలేదు. 55 శాతం ‌ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరినా స్పందించ లేదు. చివరకు ఉద్యోగులు దాచుకున్న రూ.1600 కోట్లు ఇవ్వమని అడిగినా ఇవ్వడం లేదు. గతంలో ప్రభుత్వ పెద్దల హామీని నమ్మి అన్నివిధాలా సహకరించాం. కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగించి ఉద్యోగాలు చేశాం. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉద్యోగులుగా సహకరించాం. మా జీతాల్లో కోత విధించిన సమయంలోనూ సహకరించాం. ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులను మాత్రం సంక్షోభంలోకి నెట్టేసింది. గత్యంతరం లేకనే ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. ఉద్యోగులు రోడ్డుమీదకు రావడానికి పూర్తిగా ప్రభుత్వానిదే బాధ్యత’ అని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు స్పష్టం చేశారు. దశల వారీగా ఉద్యమం చేస్తామని అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే ఉద్యమ బాట..

రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై కనీసం చర్చించే వారు లేరని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న 13 లక్షల ఉద్యోగస్తుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. 71 డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాకపోవడంతోనే పోరాటానికి సిద్ధమయ్యామన్నారు. పీఆర్సీని ప్రకటిస్తామని సీఎం తిరుపతిలో ప్రకటించారని, కానీ ఉద్యోగస్తులను చర్చలకు పిలిచి అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

11వ పీఆర్సీ అమలుపై ఎందుకు ఆలస్యం చేస్తున్నారని వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఉద్యోగస్తులు కరోనా సమయంలో ప్రభుత్వానికి ఎంతో సహకరించారని.. అయితే ప్రధాన సమస్యగా ఉన్న 11వ పీఆర్సీ అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం 7 డీఏలు పెండింగ్‌లో పెట్టిందని చెప్పారు. అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ చెప్పారని గుర్తు చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల క్రమబద్ధీకరణ పెండింగ్‌లో పెట్టారన్నారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ కూడా చెల్లించడం లేదని వాపోయారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉద్యమబాట పట్టినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తోన్న సీఎం జగన్.. ఉద్యోగస్తులను మాత్రం సంక్షోభంలో నెట్టేశారన్నారు. ప్రతీ ఉద్యోగి ఉద్యమంలో పాల్గొనాలని బొప్పరాజు కోరారు.

ఉద్యమంలోకి ప్రతీ ఉద్యోగి రావాలి..

ఈనెల 7 నుంచి ఉద్యోగులు చేపట్టనున్న ఉద్యమబాటలో ప్రతీ ఉద్యోగి భాగస్వామ్యం కావాలని ఏపీ జేఏసీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు విద్యా సాగర్ పిలుపునిచ్చారు. విజయవాడలో సోమవారం ఉద్యోగుల సమస్యలు సహా ఆందోళనపై కార్యాచరణ వివరిస్తూ కరపత్రాలు ఆవిష్కరించారు. విద్యాసాగర్ మాట్లాడుతూ 13 లక్షల ఉద్యోగులను సమాయత్త పరిచేందుకు కార్యక్రమాలను చేపట్టామన్నారు. ఉద్యోగులకు డీఏ బకాయిలు ఇవ్వని ఏకైక సర్కార్ ఏపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. సీపీఎస్‌ను రద్దు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదని విమర్శించారు. అన్ని ఉద్యోగ సంఘాలతో ఆందోళనను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

నిరసనల్లో పాల్గొనడం లేదు..

రాష్ట్రంలో మంగళవారం నుంచి ఉమ్మడి జేఏసీ చేపట్టే నిరసనల్లో తాము పాల్గొనబోమని ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోషియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవికుమార్, కార్యదర్శి రమణారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ 10 రోజుల్లోగా పీఆర్సీ ప్రకటిస్తామన్నారన్నారు. దాని కోసం ఎదురు చూస్తామని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

నేను ఎవరి తొత్తును కాను..

ఉద్యోగులు ఎవరికీ, ఏ పార్టీకీ తొత్తుగా వ్యవహరించరని ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఏ ముఖ్యమంత్రితోనైనా సత్సంబంధాలతోనే నడుస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన ఆదివారం ప్రభుత్వాన్ని కూల్చే సత్తా ఉద్యోగులకు ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఉద్యమంలో భాగంగా.. ఉద్యోగుల్ని ఉత్తేజ పరచడానికి కొన్ని వ్యాఖ్యలు చేశానని.. దాన్ని భూతద్దంలో చూపి ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కొన్ని పత్రికలు తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాస్తున్నాయని.. అందువల్లే తమపై తప్పుడు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. తమకు రాజకీయాలు అవసరం లేదని ఉద్యోగుల సమస్యల కోసమే పోరాటం చేస్తున్నట్లు తేల్చి చెప్పారు. తన వ్యాఖ్యల్లో ఏవిధమైన రాజకీయ కోణం లేదని, తాను ఎవరి తొత్తును కాదన్నారు. తమకు పార్టీలు అంటగట్టొద్దని విజ్ఞప్తి చేశారు. మంగళవారం నుంచి ఉద్యమం ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు.

ప్రభుత్వాన్ని కూల్చుతామనడం సరికాదు..

ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేయొచ్చు కానీ.. ప్రభుత్వాన్ని కూల్చుతామనే వ్యాఖ్యలు చేయడం సరికాదని ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఎల్లప్పుడు ఉద్యోగుల పక్షపాతి అని స్పష్టం చేశారు. ఉద్యోగులు అడగకపోయినా అధికారంలోకి రాగానే 27 శాతం మధ్యంతర భృతిని మంజూరు చేయడంతో పాటు.. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం.. గ్రామ సచివాలయాల్లో అతి తక్కువ కాలంలో లక్ష ముప్పై వేలమంది ఉద్యోగులను పారదర్శకంగా నియమించడం గొప్ప విషయమని కొనియాడారు. త్వరలోనే 11వ పీఆర్సీని ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించినట్లు చెప్పుకొచ్చారు. ఉద్యోగస్తులు సీఎంను తమ కుటుంబ పెద్దగా గౌరవిస్తారని.. ఏదైనా బాధ కలిగినప్పుడు ఉద్యోగులు కుటుంబ సభ్యులుగా కొంత బాధను వ్యక్తం చేస్తారే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

రాజకీయాల్లోకి వెళ్లొచ్చు..

‘ఉద్యోగులు ప్రజల్లో, ప్రభుత్వంలో భాగం. మా ఆలోచనలు కింది స్థాయికి తీసుకెళ్లాల్సిన వారిపై ప్రేమే ఉంటుంది. చంద్రబాబు డీఏలు ఎగ్గొడితే మేము రాగానే ఐఆర్ ఇచ్చాం. కొవిడ్ వల్ల కాస్త ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. కొంతమంది నాయకులు మాట్లాడిన మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు నలుగురే ఉద్యోగులు కాదు కదా. ఒక వేళ వారు నిర్ణయాత్మక శక్తి అనుకుంటే రాజకీయాల్లోకి వెళ్లొచ్చు. అయితే ఉన్న పరిస్థితిని వాళ్లు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

దశల వారీగా ఉద్యమం..

మంగళవారం నుంచి ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఉద్యోగులు నిరసనలలో పాల్గొననున్నారు. ఇప్పటికే దశల వారీగా ఉద్యమం చేపడతామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రతీ ఉద్యోగి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొనాలని కోరారు. తొలివిడతలో భాగంగా ఈనెల 7 నుంచి 21 వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈనెల 7 నుంచి 10 వరకు నల్లబ్యాడ్జీలతో నిరసనలు..10న మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసనలు తెలపాలని నిర్ణయించారు.

ఈనెల 13న పాత తాలూకా కేంద్రాలలో ర్యాలీ, నిరసన ప్రదర్శనలు,16న పాత తాలూకా కేంద్రాలలో ధర్నాలు, 21న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రతీ ఉద్యోగి ఈ నిరసనల్లో పాల్గొనాలని.. ఎవరు నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. అలాగే తొలివిడత ఉద్యమంలో ప్రభుత్వం దిగి రాకపోతే రెండో దశలో ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్తామని ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.

Advertisement

Next Story

Most Viewed