వీళ్లు ప్రభుత్వానికి పక్కా వ్యతిరేకం..!

by Shyam |
వీళ్లు ప్రభుత్వానికి పక్కా వ్యతిరేకం..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలైన మొత్తం 1,926 పోస్టల్ బ్యాలట్ ఓట్లలో అధికం బీజేపీకి అనుకూలంగానే పడ్డాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందిలో కొంతమంది, 80 ఏళ్ళు దాటిన వృద్ధులు, వికలాంగులు పోస్టల్ బ్యాలట్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో పోస్టల్ బ్యాలట్ ఓట్లను లెక్కించగా అందులో 85 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది. మరో 29 చోట్ల అధికార టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. 17 చోట్ల ఎంఐఎం, రెండుచోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. పోలైన మొత్తం పోస్టల్ బ్యాలట్ ఓట్లలో సుమారు 800 చెల్లలేదని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడం గమనార్హం. ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళ లాంటిదంటూ టీఆర్ఎస్ నేతలు గంభీరంగా ప్రకటించుకున్నా ప్రభుత్వం నుంచి వివిధ రకాల సంక్షేమ పథకాలను అందుకున్న వృద్ధులు కూడా ఈసారి అధికార పార్టీకి ఓటు వేయకుండా బీజేపీ వైపు మళ్ళారు. ప్రభుత్వ సేవకులుగా ఉండే ఉద్యోగులు, సంక్షేమ పథకాలను అందుకుంటున్న వృద్ధులు కూడా టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లు పోస్టల్ బ్యాలట్ ఫలితాల ద్వారా వెల్లడవుతోంది.

Advertisement

Next Story

Most Viewed