ఆగండి.. ఫైల్ సీఎస్ దగ్గరే ఉంది..!

by Anukaran |
ఆగండి.. ఫైల్ సీఎస్ దగ్గరే ఉంది..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎక్సైజ్​ శాఖ పునర్విభజనకు ఆగస్టు నెలలో శ్రీకారం చుట్టారు. కేడర్​, పదోన్నతులు, బదిలీల ప్రక్రియ, కొత్త కార్యాలయాల ఏర్పాటు, సిబ్బంది నియామకం వంటి అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. ఫైల్​ ఆ శాఖ కమిషనర్​ దగ్గరకు చేరింది. మూడు నెలలు దాటింది. ఇప్పటిదాకా కనీసం ఆ ఫైల్​ను ఓపెన్​ కూడా చేయలేదు. ఎందుకంటే కమిషనర్​ కార్యాలయానికే వెళ్లడం లేదు. ధరణి పేరుతో సీఎస్​ దగ్గరే ఉంటున్నారు. ఆర్థిక శాఖలో ఉన్న ఇద్దరు అధికారులు ధరణి కోసమే వెళ్తున్నారు. ఫైళ్లు, బిల్లులు పెండింగులో ఉంటున్నాయి. నీటిపారుదల శాఖ పునర్​ వ్యవస్థీకరణకు హడావుడిగా నివేదికలు తయారు చేశారు. ఫైల్​ను సీఎంకు పంపించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. యాసంగి సాగు కూడా మీదికొచ్చింది. ప్రాజెక్టుల అంచనాలు ఇంకా ఫైనల్​ చేయలేదు. కారణం ఇక్కడ కూడా ప్రిన్సిపల్​ సెక్రెటరీ అందుబాటులో ఉండటం లేదు. వాణిజ్య పన్నుల శాఖలో పదోన్నతుల కోసం ఫైల్​ సిద్ధం చేసుకుని ఏడాది నుంచి ఎదురుచూస్తున్నారు. మోక్షం కలగడం లేదు. అంతర్గత బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది. ఎందుకంటే ఫైల్ సీఎస్​ దగ్గరే ఉంది.

ఏం కోటరీ’ఇది?

ధరణి ప్రభుత్వానికి సంకటంగా మారింది. రిజిస్ట్రేషన్లు ఆగిపోయి మూడు నెలల నుంచి రూపాయి ఆదాయం రావడం లేదు. వ్యవసాయేతర ఆస్తుల ప్రక్రియపై సీఎం కేసీఆర్​ కూడా మండిపడుతున్నారు. కోర్టు కూడా అక్షింతలు వేస్తోంది. ఇదంతా సీఎస్​ ఏకపక్ష నిర్ణయాలతోనే జరిగిందనే ప్రచారం జరుగుతోంది. కొందరు ఐఏఎస్​లు సీఎస్​ వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులు కార్యాలయాలకు వెళ్లడం లేదు. రెండు నెలల నుంచి తమ ఆఫీసుల వైపు చూడడమే లేదు. దీనికి ప్రధాన కారణం ధరణి పోర్టల్​. దాదాపు ఎనిమిది మంది ఐఏఎస్​లు అక్కడే ఉంటున్నారు. ఉదయం వెళ్లడం, సాంకేతిక సమస్యలపై చర్చించుకోవడం, సాయంత్రం తిరిగి వెళ్లిపోవడం ఇదే తంతుగా కొనసాగుతోంది. దీంతో వారి సొంత శాఖల ఫైళ్లన్నీ మూలకు పడుతున్నాయి. కొంతమంది ఐఏఎస్​లను సీఎస్​ కావాలనే ఇలా తన వెంట పెట్టుకుంటున్నారని, సొంత కోటరీ ఏర్పాటు చేసుకుంటున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

తేలని అంశాలు

చాలా శాఖలలో ఉద్యోగుల సర్వీసు అంశాలు తేలడం లేదు. ఆబ్కారీ శాఖలోనే చాలా అంశాలు పెండింగ్​లో ఉంటున్నాయి. ఆగస్టులో ఎక్సైజ్​ శాఖలో విభజన ప్రక్రియకు ఫైల్​ సిద్ధం చేయడంతో సంబురాలు చేసుకున్నారు. పదోన్నతులు వస్తాయని ఆశపడ్డారు. బదిలీలు అవుతాయని రంగులు చల్లుకున్నారు. ఈ ఫైల్​ ముడి కూడా విప్పడం లేదు. స్వయంగా మంత్రి సూచించినా ధరణి డ్యూటీ అంటూ దాట వేస్తున్నారు. ఏండ్ల తరబడి బదిలీలే చేయడం లేదు. కమిషనర్​కు సమయం కుదరడం లేదని పెండింగ్​ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఐఏఎస్​లు సీఎస్​ చుట్టూ ఉండటంపై ఆయా విభాగాల అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరికొంత మందిని కనీసం పోస్టింగ్​లు లేకుండా చేస్తున్నారంటూ అసంతృప్తి వెళ్లగక్కతున్నారు. ధరణి అంశం ఎటూ తెగడం లేదు. రిజిస్ట్రేషన్ల శాఖను సీఎం దగ్గర బద్నాం చేసిన అధికారులు మళ్లీ పాత విధానాన్నే కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. కీలక విభాగాల అధికారులను సీఎస్​ కార్యాలయానికే పరిమితం చేస్తే పనులు ఎలా అవుతాయనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి వ్యవహారాలు ప్రభుత్వానికి చెడ్డపేరును తీసుకువస్తాయని చెప్పుకుంటున్నారు. ఓ సీనియర్​ ఐఏఎస్​ అధికారికి నాలుగు నెలల నుంచి వాహనం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని చర్చ జరుగుతోంది. ఉద్ధేశ్యపూర్వకంగానే ఐఏఎస్​లను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed