పట్టభద్రుల ఓట్ల కోసం భారీ ఆఫర్లు

by Shyam |   ( Updated:2021-03-10 11:08:27.0  )
Membership registration, TRS leaders
X

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్: సర్కార్ వరాల జల్లు కురిపిస్తున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు రాబట్టేందుకు ఊరించే ఆఫర్లు ప్రకటిస్తున్నది. ఏళ్లుగా వేధిస్తున్న సమస్యను.., ఎన్నడో పరిష్కరించే అంశాలను నేడు ముందుకు తెచ్చింది. ఉద్యోగ సంఘాలను మచ్చిక చేసుకునేందుకు వారు లేవనెత్తిన సమస్యలపై తాము సానుకూలంగా ఉన్నామనే సంకేతం ఇచ్చింది. దీని వల్ల వారి నుంచి ఓట్లు రాబట్టే ప్లాన్ వేసింది. అయితే ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగులు, పట్టభద్రులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ఏళ్ల నుంచి పోరాటం చేస్తుంటే.. ఓట్ల వేళా తాము గుర్తొచ్చామా అంటూ మండిపడుతున్నారు. ఎన్ని జిమ్మిక్కులు వేసినా తాము కేసీఆర్ సర్కార్ నమ్మలేమంటూ సోషల్ మీడియా వేదికపై నిరుద్యోగులు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఎమోజీలతో పంచ్‌లు, కామెంట్స్ విసురుతున్నారు.

మతలబు ఎంటి..?

రాష్ట్రంలో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు ఎప్పుడు ఎలాంటి వ‌రాల జ‌ల్లు ప్రక‌టించాల‌నేది సీఎం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. ముగ్గురు స‌భ్యుల పీఆర్సీ క‌మిటీ 7.5 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల‌ని నివేదిక సీఎంకు ఇచ్చి నెల‌లు గ‌డుస్తున్నప్పటికీ దానిపై ఎలాంటి ప్రక‌ట‌న ఆయ‌న చేయ‌లేదు. దీంతో ఉద్యోగ సంఘాలు సీఎంపై ఆగ్రహం వెల్లుబుచ్చాయి. అయినా స‌హ‌నంతోనే ఉన్నారు. పీఆర్సీ, వ‌యోప‌రిమితి పెంపు, ఏపీలో ప‌ని చేస్తున్న తెలంగాణ ఉద్యోగుల‌ను సొంత రాష్ట్రానికి తీసుకురావ‌డం, సీపీఎస్ ర‌ద్దు వంటి ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై కూడా స్పందించ‌లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప‌ని చేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఒక్కసారిగా సీఎంకు ఉద్యోగుల‌పై ప్రేమ పెరిగిపోయింది. ఉన్నఫ‌లంగా టీఎన్జీవో, టీజీఓ, ఉపాధ్యాయ సంఘాలు, నాలుగో త‌ర‌గ‌తి ఉద్యోగ సంఘాల‌తో చ‌ర్చలు జ‌రిపి వారి ప్రధాన డిమాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక మ‌త‌ల‌బు ఏమిట‌ని ఉద్యోగులు చ‌ర్చించుకుంటున్నారు.

జోకులు పేల్చొద్దు బ్రద‌ర్..

మంగ‌ళ‌వారం ఉద్యోగ సంఘాల‌తో సీఎం కేసీఆర్ చ‌ర్చలు జ‌రిపి ఆయా స‌మ‌స్యల‌పై ఈ నెలాఖ‌రు లోగా ప్రక‌ట‌న చేస్తార‌ని మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. 29 శాతం ఫిట్‎మెంట్‌తో నెలాఖారులోగా ప్రక‌ట‌న చేస్తార‌ని దీని సారాంశం. అయినా ఉద్యోగులు సీఎం ప్రక‌ట‌న‌ను న‌మ్మడం లేదు. నాన్న పులి వ‌చ్చే అనే క‌థ మాదిరిగా సీఎం కేసీఆర్ ప్రక‌ట‌న‌లు ఉంటాయ‌ని వారు చ‌మ‌త్కరిస్తున్నారు. మ‌రికొంత మంది ఉత్సాహంగా త‌మ‌కు ప‌రిచ‌యం ఉన్న మీడియా మిత్రుల‌కు ఫోన్‌లు చేసి సీఎం ప్రక‌ట‌న వాస్తవ‌మా ? అని ఆరా తీస్తున్నారు. మ‌రీ జోకులు పేల్చవ‌ద్దు బ్రద‌ర్ అంటూ వాట్సాప్ గ్రూప్‌ల్లో ఎమోజీల‌తో వ్యాఖ్యలు పెడుతున్నారు. మొత్తం మీద సీఎం కేసీఆర్ ఉద్యోగుల‌కు ఇచ్చిన వ‌రాలు సోష‌ల్ మీడియాలో చ‌ర్చనీయాంశంగా మారాయి.

అంతా ఎన్నిక‌ల స్టంట్…?

సీఎం కేసీఆర్ ఉద్యోగుల‌కు ప్రక‌టించిన వ‌రాల జ‌ల్లు అంతా ఎన్నిక‌ల స్టంట్ అని ఉద్యోగులు కొట్టి పారేస్తున్నారు. మ‌రో మూడు రోజుల్లో రాష్ట్రంలో మ‌హ‌బూబ్ న‌గ‌ర్, రంగారెడ్డి, హైద‌రాబాద్, న‌ల్గొండ‌, వ‌రంగ‌ల్, ఖ‌మ్మం ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే అధికార పార్టీ దుబ్బాక ఉప ఎన్నికలో అనూహ్యంగా ఓట‌మి పాలైంది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఆశించిన మేర విజ‌యం ద‌క్కలేదు. దీంతో పార్టీపై వ్యతిరేక‌త ‌మొద‌లైంద‌నే ప్రచారం ఊపందుకుంది. ఇలాంటి స‌మ‌యంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు రావ‌డంతో టీఆర్ఎస్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. ఉద్యోగులకు పీఆర్సీ, వ‌యో ప‌రిమితి పెంపు, ఏపీలో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌ను సొంత రాష్ట్రానికి తీసుకురావ‌డం వంటి వాటిపై స్పష్టమైన ప్రక‌ట‌న చేయ‌క‌పోతే వారి ఓట్లు ప‌డ‌ని ప‌రిస్థితి ఉంద‌నే విష‌యాన్ని గ్రహించిన సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాల‌ను సంతృప్తి ప‌ర్చి ఓట్లు రాబ‌ట్టుకునేందుకే వారికి అనుకూల ప్రక‌ట‌న చేశార‌ని ఉద్యోగులు చ‌ర్చించుకుంటున్నారు.

ఇన్ని రోజులు లేనిది ఇప్పుడేందుకు..?

ఉద్యోగుల డిమాండ్లపై ఇన్ని రోజులు ప్రక‌ట‌న చేయ‌ని సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాలకు ఎన్నిక‌లు జ‌రుగుతున్న త‌రుణంలో హ‌డావుడిగా ఉద్యోగ సంఘాల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి ప్రక‌ట‌న చేయ‌డం ఏమిట‌ని ప‌లువురు ఉద్యోగులు, ప‌ట్టభ‌ద్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పీఆర్సీ క‌మిటీ నివేదిక ఇచ్చిన స‌మ‌యంలోనే ప్రక‌ట‌న చేసి ఉండేవార‌ని, ఓట్ల కోస‌మే ఉద్యోగుల‌ను మ‌భ్య పెడుతున్నార‌ని వారు మండిపండుతున్నారు. కాగా ఇదే స‌మ‌యంలో ఉద్యోగుల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు పెంచితే ఉద్యమిస్తామ‌ని నిరుద్యోగ ప‌ట్టభ‌ద్రులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed