గవర్నర్ నోట సర్కారుకు నచ్చని మాట.. ఏం జరగబోతోంది..?

by Anukaran |
గవర్నర్ నోట సర్కారుకు నచ్చని మాట.. ఏం జరగబోతోంది..?
X

దిశ, ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర ప్రజలు ఈ నెల 17న హైదరాబాద్​ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర గవర్నర్ ​తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. వీరోచిత పోరాటం చేసి అసువులు బాసిన వారికి నివాళులర్పించాలని కోరారు. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడానికి తిరస్కరిస్తున్నది. మరోవైపు రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న రాష్ట్ర ప్రథమ పౌరురాలు తమిళి సై సౌందరరాజన్​ విమోచన దినోత్సవం జరుపుకోవాలని అసాధారణ రీతిలో బహిరంగ ప్రకటన విడుదల చేశారు.

వాస్తవానికి నిజాం పరిపాలన నుంచి హైదరాబాద్ ​విముక్తి పొందిన సెప్టెంబర్ ​నెల 17వ తేదీని విమోచన దినంగా ప్రభుత్వం అధికారికంగా జరపాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్​ చేస్తున్నది. దీనికోసం తరుచూ ఆందోళనా కార్యక్రమాలను చేపడుతున్నది. కానీ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదు. బీజేపీ మతం పేరిట రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నదని టీఆర్ఎస్​ ఆరోపిస్తున్నది.

మైనార్టీలను సంతృప్తి పరచడానికి, మజ్లీస్​పార్టీ ఒత్తిడికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని విస్మరిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి ఒక అడుగు ముందుకేసి నిర్మల్​లో కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో బహిరంగసభను ఏర్పాటు చేశారు. విమోచన దినోత్సవం విషయంలో ప్రభుత్వానితో పోరాటానికి తాము సిద్ధమని పార్టీ ప్రకటించింది. ఒక వైపు ఈ విషయంపై తెలంగాణ సర్కార్​కు , బీజేపీకి మధ్య పొలిటికల్ ​వార్​ జరుగుతుండగా గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నర్​ తమిళి సై సౌందర రాజన్​ అనూహ్యంగా జారీ చేసిన ప్రెస్​ రిలీజ్​రాజకీయ వర్గాలలో కలకలం రేపుతున్నది.

గవర్నర్ జారీ చేసిన ప్రకటనలో తెలంగాణ ప్రజలకు విమోచన దినం సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌కు నిజాం పాలన నుంచి విముక్తి కలిగించి భారతదేశంలో విలీనం చేయడానికి జరిగిన పోరాటం చరిత్రలో మరువలేనిదన్నారు. వాస్తవానికి 15 ఆగస్టు 1947నాడు దేశమంతటా స్వాతంత్ర్యం వస్తే తెలంగాణ, మరాట్వాడా, హైదరాబాద్​ కర్ణాటక ప్రాంతాలకు మాత్రం విముక్తి లభించలేదని వివరించారు. కానీ ఎన్నో పోరాటాల తర్వాత 17 సెప్టెంబర్​ 1948లో హైదరాబాద్​ సంస్థానానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు.

తెలంగాణ ప్రజలు విమోచన దినాన్ని ఘనంగా జరుపుకోవాలని, పోరాటంలో అమరులైన త్యాగధనులను స్మరించుకోవాలని గవర్నర్​ పిలుపునిచ్చారు. వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఏ గవర్నర్​ కూడా ఇలాంటి ప్రకటన చేయలేదు. గతంలో గవర్నర్​గా వ్యవహరించిన ఈఎస్​ఎల్​ నరసింహన్​ అసలు విమోచనం పేరెత్తలేదు. ప్రస్తుత గవర్నర్​ తమిళి సై సౌందరరాజన్​ కూడా గత ఏడాది ప్రకటన విడుదల చేయలేదు. కానీ ఈ సారి అకస్మాత్తుగా ప్రకటన విడుదల చేయడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నది.

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా స్వయంగా విమోచన దినోత్సవంలో పాలుపంచుకుంటున్న తరుణంలో ప్రజలకు ఊతమిచ్చేలా గవర్నర్​ ఈ ప్రకటన చేసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఇటీవల సామాజిక సేవ కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు ఇంతవరకు గవర్నర్​ ఆమోదముద్ర వేయలేదు. అదేమంటే అసలు ఆయన ఎంత సోషల్​ వర్క్​చేశారు. ఆయన బ్యాక్​గ్రౌండ్​ ఏమిటి అనే విషయం పరిశీలించుకోవాలి కదా అని సూటిగా సమాధానమిచ్చారు.

పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్​ గవర్నర్​గా అదనపు బాధ్యతలను చేపట్టిన తర్వాత తెలంగాణలో కొన్ని విషయాలలో గవర్నర్​ కఠినమైన నిర్ణయాలను తీసుకుంటున్నారని, ప్రభుత్వం సై అంటే నై అని తలపడటానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. బీజేపీ నాయకులు ప్రభుత్వం పట్ల తాము మెతక వైఖరిని అవలంభించడం లేదని, గల్లీలో కుస్తీ , ఢిల్లీలో దోస్తీ అనేది అబద్ధమని ప్రజలలో ప్రచారం చేస్తున్న క్రమంలో గవర్నర్​ అసాధారణ ప్రకటన రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నది. మరో వైపు నిర్మల్​లో శుక్రవారం జరుగనున్న విమోచన సభకు అమిత్​షా హాజరవుతున్నారు. దీని కోసం ఇప్పటికే బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది.

Advertisement

Next Story

Most Viewed