వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు 1000 డాలర్లు : సుందర్ పిచాయ్

by  |
వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు 1000 డాలర్లు : సుందర్ పిచాయ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది చివరి వరకు గూగుల్ ఉద్యోగులు ఇంటినుంచే విధులు నిర్వహిస్తారని ఆ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ జూలై నుంచి అన్నీ భద్రతా చర్యలతో ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలోనే జూలై 6 నుంచి తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులకు వెయ్యి డాలర్లు బోనస్ ఇస్తున్నట్లు వెల్లడించారు.

వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు, వారి పిల్లల సంరక్షణ ఖర్చుల కోసం ఫేస్‌బుక్ వెయ్యి డాలర్లు బోనస్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు గూగుల్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. ‘ఈ ఏడాది చివరి వరకు ఎక్కువమంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న నేపథ్యంలో ఎక్విప్‌మెంట్ హెల్ప్ కోసం ప్రతి ఉద్యోగికి 1,000 డాలర్లు ఇస్తున్నట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు. ల్యాప్‌టాప్, ఇతర హార్డ్‌వేర్, ఫర్నిచర్ పరికరాల ఖర్చుల కోసం ఇవి వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రతి రెండు వారాలకు ఒక రోజు ఆఫీసుకు వచ్చేలా ఉద్యోగులు ప్లాన్ చేసుకుంటే, ఆఫీసులో సుమారు 10 శాతం సిబ్బంది ఉంటారని దీన్ని ఆలోచించాలన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే రొటేషన్ ప్రోగ్రామ్‌ ద్వారా సెప్టెంబర్ నాటికి 30 శాతం ఉద్యోగుల హాజరు ఉంటుందని గూగుల్ సీఈవో అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జూలై 6 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాలను ఓపెన్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story