నిరుద్యోగులకు న్యూ ఇయర్ గుడ్‌న్యూస్.. నోటిఫికేషన్స్‌కి లైన్ క్లియర్

by Anukaran |   ( Updated:2021-12-24 00:16:04.0  )
నిరుద్యోగులకు న్యూ ఇయర్ గుడ్‌న్యూస్.. నోటిఫికేషన్స్‌కి లైన్ క్లియర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏడాదికి పైగా ఖాళీ పోస్టుల భర్తీపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. నిరుద్యోగులు కూడా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం ఏ ఉద్యోగి, ఏ పోస్టు ఏ జిల్లాకు, ఏ జోన్‌కు, ఏ మల్టీ జోన్‌కు అనేది తేలిపోతున్నది. ఈ నెల 31వ తేదీకల్లా కొత్త అలాట్‌మెంట్ ప్రకారం ఉద్యోగులు రిపోర్టు చేయాలని సర్కారు డెడ్‌లైన్ విధించింది. ఆ మరుసటి రోజుకు జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయిలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత వాటిని భర్తీ చేయడానికి మార్గం సుగమమవుతుంది. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడమే బాకీ. ఆ ప్రక్రియ కోసమే నెల రోజులుగా కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం అలాట్‌మెంట్ కసరత్తు ఎన్నడూ లేనంత వేగంగా జరుగుతున్నది.

ముఖ్యమంత్రి కేసీఆర్ గతేడాది డిసెంబరు 13వ తేదీన 50 వేల ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేశారు. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కానీ దాదాపు రెండు వారాలుగా సచివాలయం మొదలు జిల్లా కార్యాలయం వరకు జరుగుతున్న అలాట్‌మెంట్ ప్రక్రియ మాత్రం జోరుగా సాగుతున్నది. ఈ నెల 31వ తేదీకల్లా అన్ని స్థాయిల్లోని ఉద్యోగులు వారికి కేటాయించిన కొత్త ప్రాంతానికి వెళ్ళి అలాంట్‌మెంట్ లెటర్ ప్రకారం రిపోర్టు చేయడం పూర్తవుతుంది. ప్రతీ ఉద్యోగి విధిగా రిపోర్టు చేయాల్సిందే. ఆప్షన్లకు విరుద్దంగా అలాట్‌మెంట్ లెటర్ వచ్చినా, వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా కొత్త ప్రాంతంలో రిపోర్టు చేయడం మాత్రం తప్పనిసరి.

ఆ ప్రకారం జనవరి 1వ తేదీ నాటికి నిర్దిష్టంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయడానికి గ్రౌండ్ సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం తక్షణం ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయాలని భావించినట్లయితే దానికి తగినట్లుగానే కసరత్తు మొదలవుతుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా మెడికల్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు, లేదా పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్లు ఇవ్వడానికి వెసులుబాటు కలుగుతుంది. అన్ని జిల్లాలు, జోన్‌లు, మల్టీ జోన్‌ల నుంచి పూర్తి స్థాయి వివరాలను సేకరించిన తర్వాత ఈ ప్రక్రియను ప్రారంభించడం కోసమే ఇప్పుడు కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం అలాట్‌మెంట్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు సచివాలయ అధికారి ఒకరు తెలిపారు.

ప్రత్యేక కేడర్ పోస్టులు ఎలా..?

కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం జిల్లా, జోనల్, మల్టీ జోనల్ మాత్రమే అలాట్‌మెంట్ ఉంటుంది. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్టేట్ కేడర్ కింద రిక్రూట్ అయిన ఉద్యోగుల విషయంలో గందరగోళం చోటుచేసుకుంది. స్టేట్ కేడర్ పోస్టుల్ని మల్టీ జోనల్ స్థాయికి కుదించడంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నదనే విమర్శలూ వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన విషయంలో కమల్‌నాథన్ కమిటీ అన్ని వైపుల నుంచి సంప్రదింపులు జరిపి ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో నిర్ణయం చేసి ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకుని ఇబ్బంది లేకుండా చేసిందని గుర్తుచేస్తున్నారు. కానీ, ఇప్పుడు మాత్రం ఉద్యోగుల మనోభావాలకు విరుద్ధంగా వారి అభిప్రాయాలను కనీసంగా పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదని ఆరోపిస్తున్నారు.

సమైక్య రాష్ట్రంలో హెచ్‌ఓడీలలో ఓపెన్ కేటగిరీలో డైరెక్టుగా రిక్రూట్ అయిన పోస్టులన్నీ ఇప్పుడు జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పరిధిలోకి వెళ్ళిపోయాయి. ఓపెన్ కోటాలో రిక్రూట్ అయిన ఇతర రాష్ట్రాల స్థానికత కలిగిన ఉద్యోగులు సైతం ఇప్పుడు చెట్టుకొకరు పుట్టకొకరుగా అలాట్ అయ్యారు. ఇష్టం ఉన్నా లేకపోయినా కొత్త ప్రాంతాల్లో రిపోర్టు చేయడం తప్పనిసరి అయింది. ఆ తర్వాత బదిలీలు, ప్రత్యేక కారణాలు, మెడికల్ లాంటి గ్రౌండ్స్ అంశాలతో కోరుకున్న ప్రాంతానికి మారడానికి వెసులుబాటు ఉంటుంది. కానీ ‘స్పెషల్ కేటగిరీ’ పోస్టుల విషయంలో మాత్రం ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదు. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ లాంటి వందలాది పోస్టులు కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం ఏ కేటగిరీలోకి వెళ్తాయనేదానిపై స్పష్టత లేదు. అందువల్లనే తాజా ప్రక్రియలో ఆ పోస్టులు పెండింగ్‌లో పడిపోయాయి.

త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడే చాన్స్..?

క్షేత్రస్థాయిలో వివిధ సెక్షన్ల ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అసంతృప్తి, వ్యతిరేకత నేపథ్యంలో సీఎం కేసీఆర్ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. హుజూరాబాద్ తర్వాతి పరిస్థితుల్లో ప్రత్యర్థి పార్టీ బలపడుతుండడంతో వడ్ల కొనుగోళ్ళ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీని ఇరుకున పెట్టే ఎత్తుగడలు మొదలయ్యాయి. ఇక నిరుద్యోగుల విషయంలో చాలా కాలంగా ఉన్న అసంతృప్తిని చల్లార్చాలని భావిస్తున్నారు. ఇప్పుడు జోనల్ విధానంతో ఖాళీ పోస్టులపై స్పష్టత వస్తున్నందున వీలైనంత తొందరగా నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని సచివాలయ వర్గాల సమాచారం. దాని కోసమే ఇప్పుడు ఆగమేఘాల మీద జోనల్ అలాట్‌మెంట్ కసరత్తు జరుగుతున్నదని నొక్కిచెప్పారు.

జనవరి 1వ తేదీ తర్వాత వారం రోజుల వ్యవధిలో అన్ని జిల్లాలు, జోన్‌లు, మల్టీ జోన్‌ల నుంచి పూర్తి వివరాలు సచివాలయానికి అందుతాయి కాబట్టి ఇక ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే రోజుల వ్యవధిలోనే నోటిఫికేషన్లు జారీ చేయవచ్చని పేర్కొన్నారు. సీఎం విధాన నిర్ణయం తీసుకోవడమే తప్ప సాంకేతికపరంగా ఎలాంటి చిక్కులూ ఉండవన్నారు. నోటిఫికేషన్ తర్వాత కూడా రిక్రూట్‌మెంట్‌లో ఎలాంటి గందరగోళానికి ఆస్కారం ఉండదని పేర్కొన్నారు. ఒకవేళ అలాట్‌మెంట్‌పై గ్రూప్ వన్ స్థాయి అధికారులు స్టేట్ కేడర్ పోస్టు మల్టీ జోనల్ స్థాయికి తగ్గిపోయిందంటూ పిటిషన్‌లు దాఖలు చేసినా అది రిక్రూట్‌మెంట్‌పై ప్రభావం చూపదని తెలిపారు. అలాట్‌మెంట్ ప్రకారం రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి లెక్కల్లో ఎలాంటి తేడాలకు ఆస్కారం ఉండదన్నారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగాలు, మంచి వేతనం, అప్లై చేయండి

Advertisement

Next Story

Most Viewed