నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేసీఆర్ కీలక ప్రకటన…

by Anukaran |
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేసీఆర్ కీలక ప్రకటన…
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం తక్షణం డాక్టర్లను, నర్సులను, లాబ్ టెక్నీషియన్లను, పారామెడికల్ సిబ్బందిని ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన మూడు నెలల పాటు నియమించుకోవాలని నిర్ణయించింది. తక్షణం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ పూర్తిచేసి సిద్ధంగా ఉన్న సుమారు యాభై వేల మంది నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించారు. వరంగల్, ఆదిలాబాద్ పట్టణాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణంలో ఉన్న ఈ ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ. 28 కోట్లను వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు తొలి ప్రాధాన్యతగా టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు.

వైద్యారోగ్య శాఖ అధికారులతో ప్రగతి భవన్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన సమీక్షా సమావేశంలో పలు అంశాలపై చర్చించిన తర్వాత విడుదల చేసిన ప్రకటనలో పై వివరాలను వెల్లడించారు. “కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా పనిచేస్తున్నరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిపై పని వత్తిడి తగ్గించాలి. ఎంబీబీఎస్ పూర్తిచేసి సిద్దంగా వున్న అర్హులైన వైద్యుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలి. రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ని తక్షణమే నియమించుకోవాలి. కరోనా వైద్యంలో వారి సేవలను వినియోగించుకోవాలి. వీరికి గౌరవప్రదమైన రీతిలో జీతాలు అందించాలి. కీలక సమయంలో రాష్ట్రం కోసం పనిచేస్తున్నందున వారి సేవలకు సరియైన గుర్తింపునివ్వాలి. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వారికి వెయిటేజీ మార్కులను కలపాలి“ అని కేసీఆర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

కష్టకాలంలో ప్రజల కోసం సేవ చేయడానికి ముందుకు రావాలని యువ డాక్టర్లకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆసక్తి వున్నవారు ఆన్‌లైన్‌ https://odls.telangana.gov.in/medicalrecruitment/Home.aspx లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. డాక్టర్లతో పాటు రాష్ట్రంలో అర్హత ఉన్న నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు

వరంగల్, అదిలాబాద్ పట్టణాల్లో సూపర్ స్పెషాలిటీ దవాఖానలను వెంటనే ప్రారంభించాలని, 729 మంది వైద్య సిబ్బంది నియమించుకోవాలని సంబంధిత అధికారులను కేసీఆర్ ఆదేశించారు. కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మించిన ఎంజీఎంకు చెందిన 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను, అదిలాబాద్ జిల్లా ‘రిమ్స్’లోని మరో 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను తక్షణమే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పీఎంఎస్ఎస్‌వై (ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన) పథకం కింద ఎంజీఎంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ నిర్మాణానికి ప్రభుత్వ వాటా కింద తక్షణం అందచేయాల్సిన రూ. 8 కోట్లను, ‘రిమ్స్‘లో రూ. 20 కోట్లను తక్షణమే విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. వరంగల్ దవాఖానా కోసం 363 మంది వైద్య సిబ్బంది, అదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ కోసం 366 మంది వైద్య సిబ్బంది నియామకానికి తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.

ఆక్సిజన్‌కు, రెమిడెసివిర్‌కు కొరత లేదు

రాష్ట్రంలో ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, బెడ్లు, ఇతర కరోనా సౌకర్యాల పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఎలాంటి కొరత లేదని తెలిపారు. రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులోనే వున్నాయని, ఇతర మందులన్నింటినీ సిద్దంగా ఉంచినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 7,393 బెడ్‌లు, 2,470 ఆక్సిజన్ బెడ్‌లు, 600 వెంటిలేటర్ బెడ్‌లు సిద్దంగా వున్నట్లు తెలిపారు. ప్రైవేటు దవాఖానాల్లో రెమిడెసివిర్ ఇంజక్షన్లను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

ఆటో, క్యాబ్ డ్రైవర్లకు తొలుత వ్యాక్సిన్

వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఏయే సెక్షన్ల ప్రజలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలో ఈ సమావేశంలో నిర్ణయించింది. వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న మార్గాలను అధికారులతో కలిసి విశ్లేషించారు. “అతివేగంగా ‘వ్యాప్తి కారకు‘లను గుర్తించి వారికి ముందువరుసలో టీకాలు వేస్తే బాగుంటుంది. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యాస్ డెలివరీ బాయ్స్, స్ట్రీట్ వెండార్స్, ఇంకా పలు దిక్కులకు పోయి పనిచేసే కార్మికులు తదితరులను కరోనా వ్యాప్తి అధికం చేసే అవకాశాలున్న వారిగా ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించి వాక్సిన్‌ను అందచేసేందుకు నిబంధనలను సడలించాలి” అని కేంద్ర వైద్యారోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు సీఎం కేసీఆర్ సూచించారు. ఆ వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించడం ద్వారా కరోనా వ్యాప్తిని అధిక భాగం అరికట్టే అవకాశముంటుందని సీఎం వివరించారు. ఈ సూచనలకు సానుకూలంగా స్పందించిన కేంద్రం మంత్రి త్వరలోనే ప్రధానితో చర్చించి తదనుగుణమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఈ సమావేశంలో మంత్రులు హరీష్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కోవిడ్ సీఎంఓ ప్రత్యేక అధికారి రాజశేఖర్‌రెడ్డి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ డాక్టర్ రమేష్‌రెడ్డి, కాళోజి హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, టిఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్ర శేఖర్ రెడ్డి , టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed