రైతులకు తీపి కబురు

by Shyam |
రైతులకు తీపి కబురు
X

దిశ, మెదక్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబరు 11 వరకు రైతులు పొందిన స్వల్పకాలిక రుణాలను( రూ . 25 వేల లోపు ) ఒకే విడతలో ప్రభుత్వం మాఫీ చేయనుంది. బంగారం తాకట్టు పెట్టి రైతులు తీసుకున్న పంట రుణాలకూ మాఫీని వర్తింపజేయనుంది. రుణమాఫీ ప్రయోజనం రైతులకు అందించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఒక ఐటీ పోర్టల్ రూపొందించింది. సిద్దిపేట జిల్లాలో 12,893 మంది అర్హులు. సిద్దిపేట జిల్లాకు సంబంధించి రూ 25 వేల లోపు రుణాలను తీసుకున్న రైతుల నివేదికను వ్యవసాయాధికారులు ఇప్పటికే అందజేశారు. జిల్లాకు చెందిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవ చూపించడంతో రైతుల జాబితాను వెంటనే సిద్ధం చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా 1,49,591 మంది రైతులు ఉండగా వీరిలో రూ . 25 వేలలోపు రుణం తీసుకున్న రైతులు 12,893 మంది ఉన్నారు. తొలి విడతలో వారికి మాత్రమే మాఫీ కానుంది. కాగా, జిల్లాలోని పలు బ్యాంకుల్లో రూ . 1 , 083 కోట్ల వరకు రుణాలు తీసుకోగా నిబంధనల ప్రకారం లక్ష లోపు ఉన్నవారిని మాత్రమే గుర్తించారు. వీరి పేరిట రూ . 983 . 51 కోట్ల రుణం ఉంది. దశల వారీగా ఇదంతా మాఫీ అవుతుంది. ప్రస్తుతం రూ . 25 వేలలోపు ఉన్న 12 , 893 మంది రైతుల మాఫీకి సంబంధించి రూ . 19.69 కోట్లు కేటాయించారు.

నివేదికను సమర్పించాం..

రైతులకు త్వరితగతిన రుణమాఫీ జరగాలనే ఉద్దేశంతో వివరాలను సిద్ధం చేసి అడిగిన వెంటనే ప్రభుత్వానికి సమర్పించామని సిద్దిపేట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ తెలిపారు. మంత్రి హరీశ్ రావు సూచనల మేరకు అర్హులైన రైతులందరినీ గుర్తించామని, త్వరలోనే రుణం మాఫీ అవుతుందని, రైతులెవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. దశల వారీగా మిగితా వారి రుణాలు కూడా మాఫీ అవుతాయని ఆయన చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed