సెన్సేషనల్ న్యూస్: బాల్క సుమన్ ఇలాకాలో గోల్డ్ దందా…

by Anukaran |   ( Updated:2021-08-01 22:13:14.0  )
balka-suman 1
X

దిశ, తెలంగాణ బ్యూరో: చెన్నూరు కేంద్రంగా నకిలీ బంగారు బిస్కెట్ల దందా జోరుగా సాగుతున్నది. మోనోగ్రాం స్టాంపులు బెంగళూరులో తయారు చేయించి తీసుకొచ్చి కొందరు ఈ వ్యాపారం సాగిస్తున్నారు. 999.0 స్వచ్ఛత అనే స్టాంపు వేసి నాసిరకం బంగారాన్ని ప్రజలకు అంటగడుతున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల ప్రమేయం కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.

బిస్కట్​ బంగారం అంటే అందరూ నాణ్యమైనదనే భావిస్తారు. ఈ నమ్మకమే కొందరికి కాసులు కురిపిస్తున్నది. స్థానికంగా ప్యూరిఫై చేసిన బంగారంలో కొంత వెండి కలిపి నాసిరకం బంగారు బిస్కట్లను తయారు చేస్తున్నారు. ఈ నాసిరకం దందాకు మంచిర్యాల జిల్లా చెన్నూరు అడ్డగా మారింది. నిర్భయంగా మోనో గ్రాం తయారు చేసి బంగారంపై ముద్రించి విక్రయాలు కొనసాగిస్తున్నారు.

చెన్నూరుకు చెద

నాణ్యమైన బంగారం విక్రయాలకు మారుపేరుగా ఉన్న చెన్నూరు ఖ్యాతికి చెదపట్టించారు. కొందరు వ్యాపారుల కారణంగా ఆ ఖ్యాతి మసకబారుతున్నది. అసలును పోలిన రెండో రకం బంగారం బిస్కెట్లు తయారీ చేసి తక్కువ ధరకు విక్రయిస్తూ కొనుగోలుదారులను మోసం చేస్తున్న తీరు పలువురిని విస్మయపరిచింది. వివిధ వర్గాల వద్ద కొనుగోలు చేసిన పాత బంగారాన్ని కరిగించి బిస్కెట్ల రూపంలో తయారు చేసి విక్రయించడం ఆరంభించారు. మార్కెట్ లో లభ్యం అయ్యే అసలు బంగారం ధర కన్నా రూ. 2 వేల వరకు తక్కువగా అమ్ముతూ సోమ్ము చేసుకుంటున్నారు. రామగుండం సీపీకి నాసిరకంపై బంగారు బిస్కెట్ల తయారీపై ఫిర్యాదులు అందడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డూప్లికేట్​ బిస్కెట్లు తయారు చేసే వ్యాపారులు చెన్నూరు వదిలి పరారయ్యారు.

బిస్కట్ బంగారం అంటే?

దశాబ్దాల తరబడి కూడా బిస్కట్ బంగారం అంటే ప్రతి ఒక్కరూ మోజు పడుతుంటారు. నాణ్యత ప్రమాణాలతో తయారవుతుందని నమ్ముతుంటారు. అయితే అసలు బంగారం బిస్కట్లలో పలు రకాల ముద్రలు ఉంటాయి. కొన్ని బంగారం బిస్కట్లపై 999.0 అని ముద్రించి ఉండడంతోపాటు కింద కంప్యూటర్‌ బార్‌కోడ్‌ ఉంటుంది. మరోటి 999.9 బిస్కట్​ బంగారం.. ఇది సాధారణంగా బ్రిటన్ తదితర దేశాల​ నుంచి వస్తుంది. స్థానిక బ్యాంకులు సైతం దీనిని విక్రయిస్తుంటాయి. స్వచ్ఛతకు మారుపేరుగా దీనిని భావిస్తుంటారు. సాధారణంగా మార్కెట్లో 999.0 మోనోగ్రాంతో కూడిన 100 గ్రాముల బిస్కట్లే ఎక్కువగా దొరుకుతాయి.

అక్రమంగా తయారు ఇలా..

పాత ఆభరణాలు కరిగించి స్థానికంగా రిఫైనరీ చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా బట్టీలు ఉంటాయి. వాటిల్లోనే రిఫైనరీ ప్రక్రియ కొనసాగుతుంది. స్థానికంగా రిఫైనరీ చేయడం ద్వారా 995.0 స్వచ్ఛతతో కూడిన బంగారం వస్తుంది. దీనికి కొంత వెండి కలిపి, నకిలీ మోనోగ్రాంతో 100గ్రాముల బరువు కలిగిన బంగారు బిస్కట్లను తయారు చేస్తారు. చెన్నూరులో ఈ బంగారం బిస్కట్ల తయారీ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్నది. మోనో గ్రాం స్టాంపులను బెంగుళూరులో తయారు చేయించి తెప్పించుకున్నారని తెలిసింది.

అధికారపార్టీ నేతల ప్రమేయం..?

చెన్నూరు వ్యాపారుల అక్రమ దందా వ్యవహారంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధుల ప్రమేయం కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. వీరి అండదండలతోనే వ్యాపారులు నిర్భయంగా దందా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీపీకి కొంతమంది ఫిర్యాదు చేయడంతో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండాలని చెన్నూరు ప్రాంతంలో పనిచేస్తున్న పోలీసు అధికారులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు కూడా తెలిసింది. పోలీసులు మాత్రం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న నాయకుని ద్వారా పైరవీలు చేస్తున్నారని తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed