రాను..రానంటున్న బంగారం!

by Harish |
రాను..రానంటున్న బంగారం!
X

సాధారణంగా ఇండియాలో బంగారానికి అధిక డిమాండ్ ఉంటుంది. దేశంలో ఏడాదికి 800 నుంచి 900 టన్నుల బంగారం దిగుమతులు జరుగుతున్నాయి. వాణిజ్య లోటుపై బంగారం దిగుమతుల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జనవరి కాలంలో దేశంలో బంగారు దిగుమతులు 9 శాతం తగ్గి సుమారు రూ. 1.74 లక్షల కోట్లకు క్షీణించాయని వాణిజ్య మంత్రిత్వ శాఖా గణాంకాలు చెబుతున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు ఏప్రిల్-జనవరి కాలంలో రూ. 1.91 లక్షల కోట్లుగా ఉన్నాయి. అధిక సుంకం వల్ల వ్యాపారులు ఇతర దేశాలకు తమ వ్యాపారాన్ని మారుస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బంగారం దిగుమతులు తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి కాలంలో దేశ వాణిజ్య లోటు రూ. 9.4 లక్షల కోట్లకు క్షీణించింది. ఏడాది క్రితం ఇది రూ. 11.59 లక్షల కోట్లుగా ఉండేది. గతేడాది జులై నుంచి బంగారం దిగుమతుల్లో ప్రతికూల వృద్ధి నమోదవుతోంది.

రత్నాలు, ఆభరణాల ఎగుమతిదారులు దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని కేంద్రాన్ని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జనవరిలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 1.45 శాతం క్షీణించి రూ. 1.78 లక్షల కోట్లకు తగ్గాయి. ఇక బంగారం దిగుమతులు 3 శాతం తగ్గి 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 2.32 లక్షల కోట్లకు తగ్గాయి. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం 2019, జులై-సెప్టెంబర్ కాలంలో కరెంట్ అకౌంట్ లోటు స్థూల జాతీయోత్పత్తిలో 0.9 శాతం ఉంది. అంటే రూ. 44 వేల కోట్లకు తగ్గింది. కఠినమైన వజ్రాల దిగుమతులు 2019-20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి మధ్య కాలంలో 15.54 శాతం తగ్గి రూ. 78 వేల కోట్లకు క్షీణించాయి. బంగారు కడ్డీల దిగుమతి సైతం 3.56 శాతం తగ్గి రూ. 46.8 వేల కోట్లకు తగ్గిపోయింది.

Advertisement

Next Story