అమెరికాను వెనక్కి నెట్టిన చైనా.. ప్రపంచ సంపన్న దేశాల్లో అగ్రస్థానం..!

by Harish |   ( Updated:2021-11-16 08:26:37.0  )
china
X

దిశ, వెబ్‌డెస్క్: గత రెండు దశాబ్దాల్లో ప్రపంచ సంపద మూడు రెట్లు పెరిగిన నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా అమెరికాను చైనా అధిగమించింది. ఈ మేరకు విషయాన్ని ప్రముఖ కన్సల్టెన్సీ పరిశోధనా సంస్థ మెకిన్సే అండ్ కో ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే అమెరికా, చైనా కొన్నాళ్లుగా మధ్య వాణిజ్య పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. 2020లో కొవిడ్-19 మహమ్మారిని చూపుతూ అమెరికా చైనాపై అనేక ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే అమెరికాను దెబ్బకొట్టే రీతిలో చైనా సంపన్న దేశంగా నిలిచింది.

10 అగ్రదేశాలకు చెందిన బ్యాలెన్స్ షీట్లను పరిశీలించిన అనంతరం మెకెన్సీ అండ్ కో ఈ వివరాలను వెల్లడించింది. ప్రపంచ వృద్ధిలో ఈ పది దేశాల వాటా 60 శాతంగా ఉంది. 2000లో ప్రపంచ సంపద 156 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా ప్రస్తుతం అది 514 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని, ఈ పెరుగుదలలో మూడోవంతు చైనాదేనని మెకిన్సే అండ్ కో పేర్కొంది. 2000లో 7 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న చైనా సంపద ఇప్పుడు 120 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. అమెరికాలో రియాల్టీ ధరల పెరుగుదల ఉన్నప్పటికీ 90 ట్రిలియన్లకు పరిమితమైంది.

చైనా, అమెరికాల్లో సంపన్నులకు చెందిన షేర్లు గణనీయంగా పెరుగుతున్నాయని, అంతేకాకుండా ఈ రెండు దేశాల్లో ఉన్న మొత్తం సంపదలో మూడింట రెండు వంతులు 10 శాతం మంది వద్దే ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ప్రపంచ సంపదలో 68 శాతం రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉందని, మిగిలిన మొత్తం మౌలిక సదుపాయాలు, యంత్రాలు, పరికరాల విభాగాల్లో ఉన్నాయి. పేటెంట్లు, మేధోహక్కుల్లో తక్కువ మొత్తం ఉందని నివేదిక పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed