పీఎల్ఐ పథకంతో భారత్‌లో విస్తరిస్తున్న గ్లోబల్ కంపెనీలు

by Harish |
పీఎల్ఐ పథకంతో భారత్‌లో విస్తరిస్తున్న గ్లోబల్ కంపెనీలు
X

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్‌ఫోన్, ఇతర టెక్నాలజీ ఆధారిత రంగాల్లో ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం వంటి ఆకర్షణీయమైన కార్యక్రమాలతో గ్లోబల్ కంపెనీలు భారత్‌లో ఉత్పత్తులను విస్తరిస్తున్నాయని అపెక్స్ అవలోన్ కన్సల్టెన్సీ ఛైర్మన్ గిరిజా పాండే తెలిపారు. గ్లోబల్ తయారీదారుల నుంచి ఆసక్తి పెరుగుతుండటంతో స్మార్ట్‌వాచెస్ వంటి వేరబుల్ పరికరాల దేశీయ తయారీని పెంచేందుకు ఇంకా ఇతర రంగాలకు పీఎల్ఐని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రణాళికల అమలుతో ప్రస్తుతం జీడీపీలో తయారీ రంగం వాటా 17-18 శాతం నుంచి 25 శాతానికి పెంచేందుకు సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

పీఎల్ఐ పథకం ద్వారా ఏడాదికి 2.45 ట్రిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్,ఐటీ వస్తువుల ఎగుమతులు జరగనున్నాయి. ‘ప్రభుత్వం పీఎల్ఐ తోడ్పాటుతో ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ కంపెనీలను భారత్‌కు తీసుకురావాలని భావిస్తోంది. ఇప్పటికే యాపిల్, శాంసంగ్ భారత్‌లోనే ప్లాంట్‌లను నిర్వస్తున్నాయని’ గిరిజా పాండే పేర్కొన్నారు. అదే సమయంలో దేశీయంగా తయారయ్యే ఉత్పత్తులు ఆసియా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం నియమ నిబంధనల్లో మార్పులు చేస్తోంది.

ప్రపంచానికి కొత్త టెక్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా భారత్ మారుతున్న క్రమంలో యాపిల్ సంస్థ ఐప్యాడ్ ట్యాబ్లెట్ తయారీని తీసుకురానుందని ఇండియన్ ఇనంపోర్టర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో పాండే తెలిపారు. రాబోయే ఐదేళ్లలో యాపిల్ సరఫరాదారులు సుమారు 900 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు దేశీయ కంపెనీలైన డిక్సన్ టెక్నాలజీస్, యూటీఎల్, లావా ఇంటర్నేషనల్, మైక్రోమ్యాక్స్ తదితర సంస్థలు పీఎల్ఐ పథకం ప్రోత్సాహంతో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.

Advertisement

Next Story