కూతురిని ప్రేమించిన బాబాయ్..

by Anukaran |   ( Updated:2020-08-25 05:28:52.0  )
కూతురిని ప్రేమించిన బాబాయ్..
X

దిశ, వెబ్‌డెస్క్: జల్సాలకు అలవాటుపడిన కొందరు పోకిరీలు గ్రామాల్లో జులాయిగా తిరుగుతూ.. ప్రేమ పేరుతో అమ్మాయిలపై వేధింపులకు పాల్పడుతున్నారు. వావివరసలు, బంధాలను మరిచి లైంగిక వేధింపులకు దిగుతున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో బాబాయ్ వరసయ్యే వ్యక్తి కూతురునిని ప్రేమిస్తున్నానని వెంటపడటంతో మనస్థాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం..

నూతనకల్ మండలం యడవెల్లి గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన కళ్యాణ్ గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. అయితే కళ్యాణ్, యువతి ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో పాటు ఇద్దరు బాబాయ్, కూతురు వరస అవుతారు. దీంతో కళ్యాణ్ ప్రేమను యువతి తిరస్కరించింది. అయినా, కళ్యాణ్ గ్రామంలో జులాయిగా తిరుగుతూ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయం బయటకు చెబితే పరువు పోతుందనే భయంతో యువతి మౌనంగా భరిస్తూ వచ్చింది. ఇదే అలుసుగా తీసుకున్న కళ్యాణ్ వేధింపులను తీవ్రతరం చేశాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె.. సోమవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. యువతి ఆత్మహత్యకు కారణమైన బంటు కళ్యాణ్ పై మంగళవారం మృతురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నూతనకల్ ఎస్సై శివకుమార్ తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని తుంగతూర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed