బల్దియా ప్రయత్నమంతా వృథా అయిపోయింది..!

by Shyam |
బల్దియా ప్రయత్నమంతా వృథా అయిపోయింది..!
X

దిశ, న్యూస్‌బ్యూరో: అందరూ ఇండ్లకే పరిమితమై కఠిన లాక్‌డౌన్ అమలు చేసిన రోజుల్లో కరోనా వైరస్ అంతం కోసమంటూ హడావిడి చేసిన బల్దియా విభాగాలు నేడు కనిపించడం లేదు. తక్కువ కరోనా కేసులు వస్తున్న రోజుల్లో 24 గంటలు పనిచేసిన జీహెచ్ఎంసీ ఇప్పుడు రోజుకు వందల్లో కేసులు నమోదవుతున్నా క్రిమి సంహారకాలపై పోరాటాన్ని ఆపేసింది. ఓ దశలో కరోనా వైరస్ తమకు ఎక్కడ వస్తుందనే ఆందోళనతో విభాగాల అధిపతులు ఛాంబర్లలో ఒంటరిగా గడుపుతున్నారు. దీంతో గ్రేటర్ పరిధిలో ప్రజలను కరోనా నుంచి రక్షించే వ్యవస్థ కూడా చేతులెత్తేసినట్టయింది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఉన్న వీధిని కంటైన్ మెంట్ క్లస్టర్ గా ఏర్పాటు చేసి సెకండ్ కాంటాక్ట్ లను నిరోధించాలనే నిబంధనలు జీహెచ్ఎంసీ పట్టించుకోవట్లేదు.

అప్పుడు ట్యాంకర్లతో స్ప్రే..

మార్చి చివరి వారంలో లాక్‌డౌన్ విధించిన నాటి నుంచి కరోనాపై యుద్ధం చేస్తామని ప్రకటించిన జీహెచ్ఎంసీ నగరంలో ప్రతీ అంగుళం పరిశుభ్రంగా ఉండాలని, వైరస్‌ను అంతమొందించాలని కంకణం కట్టుకున్నట్లే చర్యలు చేపట్టింది. డీఆర్ఎఫ్, ఎంటమాలజీ బృందాలు రంగంలోకి దిగాయి. పెద్ద ట్యాంకర్లు, పంపింగ్ మిషన్ల ద్వారా బస్టాండ్లు, పబ్లిక్ ప్రదేశాలు, పరిసరాల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశాయి. ఎంత ఉత్సాహంగా పనిచేశాయంటే డీఆర్ఎఫ్ విభాగం తరఫున 19 బృందాల్లో 675 మందితో ప్రత్యేకంగా టీంలను తయారు చేశారు. 24 గంటల పాటు ఈ మూడు బృందాలు పనిచేసేలా ప్రత్యేకంగా షెడ్యూల్ రూపొందించి నగరమంతా సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. మ్యాన్‌పవర్‌తో 18 మిషన్ల ద్వారా స్ప్రే చేశారు. డీఆర్ఎఫ్ బృందాలు సగటున రోజుకు 8-9 వేల లీటర్ల క్రిమి సంహారక ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఎంటమాలజీ విభాగంలోని 150 బృందాలు రోజుకు 500 లీటర్ల ద్రావణాన్ని స్ప్రే చేసినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ విధించి 79 రోజులయింది. ప్రారంభంలో అంత కాకపోయినా ఇప్పుడు కూడా స్ప్రే చేస్తున్నారు. రోజుకు 9 వేల లీటర్ల సగటున చూసినా ఇప్పటికి 7.11 లీటర్ల ద్రావణాన్ని జీహెచ్ఎంసీ నగరంలో పిచికారి చేసింది. దీని కోసం లీటర్‌కు రూ.30 చొప్పున రెండు కోట్ల 13 లక్షల రూపాయలను ఖర్చు చేసినట్లు అంచనా. కనీసం 50 రోజులు పూర్తిస్థాయిలో పనిచేశారనుకున్నా 4.50 లక్షల లీటర్ల ద్రావణం కోసం రూ.కోటి 35 లక్షలను ఖర్చు చేశారు. సిబ్బంది జీతాలు, వాహనాలు, ఇంధనం, ఇతర ఖర్చులు అదనం. కోట్లు ఖర్చు చేసి ప్రయాసపడి చేసిన పనంతా వృథా పోయింది.

ఆత్మ రక్షణలో..

ఇండ్లల్లో ప్రజలు ఉన్నపుడు వైరస్ అంతం కోసం నిద్రలేకుండా పనిచేసిన డీఆర్ఎఫ్, ఎంటమాలజీ విభాగాలు వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఆత్మరక్షణలో పడ్డట్లు కనిపిస్తోంది. మూడు షిప్టుల్లో నగరమంతా స్ప్రే చేస్తున్నప్పుడు రోజుకు 20 కేసులు కూడా నమోదు కాలేదు. ఇప్పుడు ప్రజలంతా రోడ్లమీదకొచ్చారు. నగరంలో సాధారణ స్థాయిలోకి ప్రజాజీవనం చేరిపోయింది. రోజుకు సెంచరీకి తగ్గకుండా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కానీ, అసలు సమయంలోనే స్ప్రేయింగ్ కనిపించడం లేదు. వైరస్ ఎప్పుడు తమకు అంటుకుంటుందోనని జీహెచ్ఎంసీ, ఈవీడీఎం ఆఫీసుల్లో ఉన్నతాధికారులు ఒంటరిగా గడిపే స్థితిలోకి చేరుకున్నారు. కరోనా ఉందో లేదో తెలియని రోజుల్లో రెచ్చిపోయి పనిచేసిన జీహెచ్ఎంసీ ఇప్పుడు వైరస్ విజృంభిస్తున్నపుడు తోక ముడిచింది. దీంతో గ్రేటర్ ప్రజలకు రక్షణగా నిలిచే చివరి అస్త్రం కూడా చేతులెత్తేసినట్లయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హైపో క్లోరైడ్‌కు కరోనా చస్తుందా?

కరోనా స్టార్టింగ్ అప్పుడే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోకి అడుగు పెట్టింది. అయినా నిత్యం అక్కడ హైపో క్లోరైడ్ స్ప్రే జరగడం లేదు. ప్రభుత్వ ప్రధాన విభాగాల కార్యాలయాల్లో వైరస్‌పై యుద్ధం అంతంతగా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చు. జీహెచ్ఎంసీ స్ప్రే చేయిస్తున్న సోడియం హైపోక్లోరైడ్‌ను లిక్విడ్ బ్లీచ్ అని కూడా పిలుస్తారు. ఆల్కహాల్ లక్షణం కలిగి ఉన్న ఈ బ్లీచ్ వల్ల పరిసరాలు, వాతావరణంలోని అన్ని రకాల సూక్ష్మజీవులు నశిస్తాయి. అయితే ఇది కరోనా వైరస్‌ను కూడా నిర్మూలిస్తుందని ఇప్పటివరకూ ఎవరూ నిరూపించలేకపోయారు. నిజానికి ప్రపంచంలో బయటపడుతున్న కరోనా వివిధ రకాలైన ఆర్‌ఎన్ఏ కలిగి ఉంది. వైరస్ ఎప్పటికప్పుడు తన ఆర్ఎన్‌ఏను మార్చుకుంటూ వెళ్తుండటం వల్లే మందును కనిపెట్టడం కష్టమవుతోంది. కరోనాను అడ్డుకునే శక్తిలేని హైపో ద్రావణం స్ప్రే కోసం మానవ శ్రమ, ఆర్థిక వనరులు ఖర్చు చేయడం వృథా అయినట్టే కదా.. కరోనాను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుండటం అభినందనీయమే.. ఒకవేళ జీహెచ్ఎం భావిస్తున్న స్ప్రేయింగ్ ద్వారా కరోనా వైరస్‌ను నిలువరించడం సాధ్యమయినప్పుడు ప్రస్తుత సమయంలో ఆ కార్యక్రమాన్ని పెంచాల్సిన అవసరముంది. ఇప్పుడేమో జీహెచ్ఎంసీ విభాగాల హైపో స్ప్రేయింగ్ నిత్యం తమ కార్యాలయాల్లో కూడా చేసుకోలేకపోతున్నాయి ఎందుకో మరీ..!

Advertisement

Next Story

Most Viewed