కౌశిక్ రెడ్డికి భారీ షాక్.. KCR చెప్పిన ‘ఉజ్వల భవిష్యత్‘ అంటే ఇదేనా..?

by Anukaran |   ( Updated:2021-07-21 11:07:01.0  )
koushik-reddy-shock
X

దిశ, సిటీబ్యూరో : అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డికి తొలి రోజే బల్దియా అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన చేరిక సందర్భంగా తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలకు జీహెచ్ఎంసీ అధికారులు చలాన్లు విధించారు. మొత్తం 17 చలాన్లు విధించి రూ.4.85 లక్షల జరిమానాను విధించారు. కానీ ఈ ఫ్లెక్సీలు, బ్యానర్లను ఒక రోజు ముందే అంటే మంగళవారం సాయంత్రమే ఏర్పాటు చేసినా, పట్టించుకోని బల్దియా అధికారులు కౌశిక్ రెడ్డి చేరిక కార్యక్రమం ముగిసిన తర్వాత తొలగించి సర్కారుపై తమ విధేయతను చాటుకున్నారు.

రోడ్లకిరువైపులా, జంక్షన్లలో ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసిన ఈ బ్యానర్లు, ఫ్లెక్సీలపై బుధవారం ఉదయం నుంచే విపక్ష నేతలు మీడియాలో, సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నా పట్టించుకోని జీహెచ్ఎంసీ కౌశిక్ రెడ్డి చేరిక కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వచ్చి వెళ్లాక అనగా కార్యక్రమం పూర్తిగా ముగిసాక తొలగించటం చర్చనీయాంశమైంది. డీఫేస్ మెంట్ చట్టాన్ని నిజంగానే పక్కాగా అమలు చేయాలన్న చిత్తశుద్ధి, నిబద్ధత అధికారులకు ఉండి ఉంటే, కార్యక్రమానికి ముందైనా, కార్యక్రమం జరుగుతున్న సమయంలోనైనా వీటిని తొలగించేవారన్నది ప్రస్తుతం బల్దియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇదిలాఉండగా, పార్టీలో చేరిక సందర్భంగా కౌశిక్ రెడ్డి తండ్రి తనతో ఉద్యమంలో పాల్గొన్నాడని.. కౌశిక్‌కు మంచి ఉజ్వల భవిష్యత్ ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, గులాబీ పార్టీలో చేరిన గంటల వ్యవధిలోనే జీహెచ్ఎంసీ ఆయనకు భారీ జరిమానా విధించడంపై ట్రోల్స్ అవుతున్నాయి. ఉజ్వల భవిష్యత్ అంటే జరిమానాలు కట్టడమేనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed