వర్షాకాలాన్ని ఎదుర్కొనేందుకు బల్దియా ఏర్పాట్లు

by Shyam |
వర్షాకాలాన్ని ఎదుర్కొనేందుకు బల్దియా ఏర్పాట్లు
X

దిశ, న్యూస్ బ్యూరో: హైదరాబాద్‌లో భారీ వ‌ర్షాల‌తో ఎదుర‌వుతున్న ప‌రిస్థితుల‌ను అధిగ‌మించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. రోడ్ల మ‌ర‌మ్మ‌తులు, నాలాల పూడికతీత, ఆధునీక‌ర‌ణ‌, విస్త‌ర‌ణ ప‌నుల‌ను చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వ‌ర్ష‌పు నీటిలో ప్లాస్టిక్‌, ఇత‌ర వ్య‌ర్థాలు చేరుట‌వ‌ల‌న నాలాలు, డ్రైనేజీలోకి వెళ్లే మార్గాలు మూసుకుపోయి రోడ్ల‌పై నీరు నిలిచి వాహ‌న‌దారుల‌కు, చుట్టుప‌క్క‌ల ఆవాసాల‌కు ఇబ్బందిగా మారుతున్న‌ది. వ‌ర్ష‌పు నీరు ఎటువంటి ఆటంకాలు లేకుండా చిన్న చిన్న డ్రైనేజీల ద్వారా నాలాలోకి ప్ర‌వ‌హించుట‌కు ప్ర‌జ‌లు త‌మ బాధ్య‌త‌గా ప్లాస్టిక్‌ను, చెత్త‌ను రోడ్లు, నాలాల్లోకి వేయ‌రాదు. త‌ద్వారా వ‌ర‌ద ముంపు స‌మ‌స్య చాలా వ‌ర‌కు త‌గ్గుతుందని జీహెచ్ఎంసీ ప్రజలకు సూచిస్తోంది.

నాలాల‌లో పూడిక‌ను తొల‌గించుట‌కు జిహెచ్‌ఎంసి ప్ర‌త్యేక వార్షిక ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేస్తుంది. అందులో భాగంగా వార్షాకాలం ముందు, వ‌ర్షాకాలం త‌ర్వాత చేప‌ట్టాల్సిన ప‌నుల‌పై ల‌క్ష్యాల‌ను నిర్దేశిస్తుంది. లోత‌ట్టు ప్రాంతాలు, రోడ్ల ప‌క్క‌న‌, రోడ్ల‌పైన వ‌ర్ష‌పునీరు నిలిచిపోయ‌కుండా, డ్రెయిన్లు, నాలాల ద్వారా సుల‌భంగా వెళ్లిపోయేందుకు అనువుగా ప‌నుల‌ను చేప‌డుతుంది. అందులో భాగంగా ఈ సంవ‌త్స‌రం రూ.43.38 కోట్ల అంచ‌నా వ్య‌యంతో 4.79 ల‌క్ష‌ల క్యూబిక్ మీట‌ర్ల పూడిక‌ను తొల‌గించుట‌కు 345 ప‌నుల‌ను చేప‌ట్టినట్లు తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు 702 కిలోమీట‌ర్ల‌లో 3.75 ల‌క్ష‌ల క్యూబిక్ మీట‌ర్ల పూడిక‌ను తొల‌గింపు పూర్తయినట్లు పేర్కొంది. ముంపునకు గుర‌య్యే లోత‌ట్టు ప్రాంతాల‌తో పాటు రోడ్ల‌పై నిలిచిన వ‌ర్ష‌పు నీటిని త‌క్ష‌ణ‌మే స్పందించి తొల‌గించుట‌కు స‌మ‌స్యాత్మ‌క ప్ర‌దేశాల్లో 89 స్టాటిక్ బృందాల‌ను, 118 మినీ మొబైల్ ఎమ‌ర్జెన్సీ బృందాలు, 79 మొబైల్ ఎమ‌ర్జెన్సీ బృందాల‌ను నియ‌మించారు. ఈ బృందాలు 24గంట‌ల పాటు ఆయా ప్ర‌దేశాల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే క్షేత్ర‌స్థాయి అధికారులు, బృందాల‌తో స‌మ‌న్వ‌యం చేసేందుకు ఒక జోన‌ల్ ఎమ‌ర్జెన్సీ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా నిలిచిన‌ వ‌ర్ష‌పు నీటిని నాలాలు, డ్రెయిన్ల‌లోకి పంపుట‌కు 202 మోట‌ర్ పంపుల‌ను అందుబాటులో ఉంచారు. ఈ బృందాల‌కు తోడు పూర్తి ఆధునిక సాధ‌న సంప‌త్తితో 16 డీఆర్ ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయి.

జీహెచ్ఎంసీ పరిధిలోని స‌మ‌స్యాత్మ‌కంగా ఉన్న 195 నీటి ముంపు ప్రాంతాల‌ను గుర్తించి 157 చోట్ల ప్రాంతాల్లో ప‌నుల‌ను పూర్తి చేశారు. మిగిలిన 38 ప్రాంతాలు న‌గ‌ర పాల‌క సంస్థ ప‌రిధిలోలేని ఇత‌ర శాఖ‌ల‌కు చెందిన ప్ర‌దేశాల్లో ఉన్నాయి. వ‌ర్ష‌పు నీటిని సంర‌క్షించుట‌కు, భూగ‌ర్భ జ‌లాల పెంపుద‌ల‌కు జేఎన్టీయూ నిపుణులు ఇచ్చిన సూచ‌న‌ల మేర‌కు 44 చోట్ల ఇంజ‌క్ష‌న్ బోర్ వెల్స్‌ను ఏర్పాటు చేసి, భారీ వ‌ర్షాలు ప‌డిన‌ప్పుడు ఆ నీటిని మ‌ళ్లిస్తున్న‌ట్టు బల్దియా ప్రకటించింది. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకొని వ‌ర్షాకాల ప‌రిస్థితుల‌ను అదిగ‌మించుట‌కు చర్య‌లు చేప‌ట్టినట్లు బల్దియా స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed