కీటకాలను కాపాడేందుకు జర్మనీ కొత్త రూల్స్

by Shyam |
కీటకాలను కాపాడేందుకు జర్మనీ కొత్త రూల్స్
X

పువ్వుల మధ్య పరాగసంపర్కం జరగడంలో కీటకాలు ప్రధానపాత్ర పోషిస్తాయి. అలాగే జీవావరణంలో కీటకాలు ఒక భాగం. కానీ జర్మనీలో గత కొన్ని సంవత్సరాలుగా కీటకాల సంఖ్య తీవ్రంగా తగ్గిపోతుంది. అందుకే వాటిని సంరక్షించే ప్రయత్నంలో భాగంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ‘ఇన్‌సెక్ట్ డ్రాఫ్ట్’ పేరుతో జర్మనీ దీన్ని అమల్లోకి తీసుకురాబోతుంది. ఈ డ్రాఫ్ట్‌లో భాగంగా సాయంత్రం చీకటి పడ్డాక మొదలుకొని ఉదయం సూర్యుడు వచ్చే వరకు అవసరం లేని చోట్లలో వీధి లైట్లు ఆర్పేయాలని పేర్కొంది. అంతేకాకుండా పెద్ద పెద్ద ఫ్లడ్ లైట్లు, అలంకరణ లైట్లను కూడా వేయకూడదని ఆదేశించింది.

అలాగే కీటకాలు, పురుగులు పట్టడానికి పెట్టే ట్రాప్‌లను, కీటకనాశినిలను ఉపయోగించవద్దని తెలిపింది. ప్రధానంగా నీటి వనరులు, తోటలు, ఎండిన రాతి గోడలు ఉన్న చోట్లలో లైటింగ్ పెట్టవద్దని, ఆ చుట్టు పక్కల ఐదు నుంచి పది మీటర్ల వరకు ఎలాంటి క్రిములు, కీటక సంహారక మందులను చల్లవద్దని ఆదేశించింది. గత సెప్టెంబర్‌లో కీటకాలు అంతరించిపోవడం గురించి పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రియులు చేసిన ఆందోళనల మేరకు జర్మనీ ప్రభుత్వం ఈ కీటక రక్షక యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. దీంతో పంటపొలాల్లో వాడే క్రిమిసంహరక మందులను కట్టడి చేయడమే ధ్యేయంగా జర్మనీ వ్యవసాయ శాఖ సవాళ్లను ఎదుర్కొంటోంది. అలాగే ఈ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు కూడా జర్మనీ పారిశ్రామిక అనుమతులు ఇవ్వకుండా నిబంధనలు కట్టుదిట్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed