సిద్ధంగా ఉండాలి : ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి!

by Harish |
సిద్ధంగా ఉండాలి : ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఊహించని స్థాయిలో ఉండే అవకాశముందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం 1947 నాటి జీడీపీ వృద్ధి కనిష్ఠానికి చేరుకోవచ్చనే ఆందోళన వ్యక్తం చేశారు. జీడీపీ గణాంకాలు ప్రతికూలతను నమోదు చేసినా ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. ‘లీడింగ్ ఇండియా డిజిటల్ రివల్యూషన్’ 16వ ఎడిషన్ చర్చ సందర్భంలో నారాయణమూర్తి పై వ్యాఖ్యలు చేశారు.

భారత జీడీపీ కనీసం 5 శాతం తగ్గిపోనుందని, 1947 నాటి స్థాయికి పడిపోవచ్చని హెచ్చరించారు. దీనికోసం దేశంలోని అన్ని రంగాలు సిద్ధంగా ఉండాల్సిన అవసరముందన్నారు. ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడటానికి అవసరమైన ఆలోచనలను ఆయన ఈ చర్చలో పంచుకున్నారు. కొవిడ్-19 వ్యాక్సిన్, దాని నివారణకు సమయం పడుతుందని, ఆర్థిక కార్యకలాపాలు నిలిపేయలేమని..కావున కరోనాతో జీవించడం అలవర్చుకోవాలని నారాయణ మూర్తి కోరారు.

అంతర్జాతీయంగా వ్యాపారం క్షీణించడంతో జీడీపీ పడిపోయిందని, అంతర్జాతీయ ప్రయాణాలు దాదాపు ఆగిపోయాయి. దీనివల్ల జీడీపీ 5 నుంచి 10 శాతం వరకు పడిపోయే ప్రమాదముందని, దేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్న అన్ని రంగాల వారు అవసరమైన జాగ్రత్తలను పాటిస్తూ కొత్త ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చేయాల్సి ఉందని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు సొంత ఊళ్లకు తరలిపోయిన 14 కోట్ల మంది కార్మికులను తిరిగి పనిలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా, ప్రభుత్వాలు ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను మరింత పెంచాలని, కరోనా పరీక్షల సామర్థ్యాన్ని వేగవంతం చేయాలని తెలిపారు. అలాగే, దేశంలోని టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో సౌకర్యాల కొరత విషయంపై నారాయణ మూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Next Story