బొమ్మ కార్లు, వాహనాలే.. దివ్యాంగ శునకాల జైపూర్ ఫుట్!

by Shyam |
Gaza shelter
X

దిశ, ఫీచర్స్ : మనిషికి చిన్న గాయమైనా స్పందించేందుకు, వారి బాగోగులు చూసుకునేందుకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఉంటారు. దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదంలో కాలు, చేయి విరిగి మొత్తం తీసేయాల్సి వస్తే ఆల్టర్నేట్‌గా ‘జైపూర్ ఫుట్/హ్యాండ్’ అమర్చుతారు. ప్రస్తుతం రోబో హ్యాండ్స్ కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ మూగజీవాలకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే పట్టించుకునే వారు చాలా తక్కువ. ఈ నేపథ్యంలోనే గాజాలోని ఓ జంతు సంరక్షణ కేంద్రం వికలాంగ పిల్లులు, కుక్కల కోసం మొబిలిటీ పరికరాలను రూపొందించేందుకు బొమ్మ కార్లు, చిన్నారుల సైకిల్ చక్రాలను ఉపయోగిస్తోంది.

Gaza shelter

దివ్యాంగ కుక్కలు, పిల్లులకు ప్రత్యేక ప్రోస్థెటిక్స్‌కు యాక్సెస్ లేకపోవడంతో పాలస్తీనియన్ ఎన్‌క్లేవ్‌లోని ‘సులాలా యానిమల్ రెస్క్యూ సొసైటీ’ వాటికోసం ప్రత్యేక పరికరాలు తయారుచేస్తోంది. ఇప్పటివరకు దాదాపు 30-50 పిల్లులు, కుక్కలకు తాత్కాలిక వీల్‌చైర్స్ లేదా రీసైకిల్ చేసిన కలప, లోహంతో చేసిన కృత్రిమ అవయవాలను వాటికి అమర్చారు. ఈ పరికరాలు అవి నడిచేందుకు, పరుగెత్తేందుకు, తిరిగి సహజంగా ఆడుకోవడానికి దోహదపడుతున్నాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్‌లోని స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చిన విరాళాలతో సులాలా జంతు సంరక్షణ కేంద్రం నడుస్తోంది. అయితే గాజాలో జంతువుల కోసం ప్రత్యేకమైన వైద్య కేంద్రాలు లేకపోవడంతో మిలిటెంట్ గ్రూప్ హమాస్ దీన్ని నిర్వహిస్తోంది.

Gaza shelter

‘జంతువులు పక్షవాతానికి గురైనప్పుడు అలసిపోతాయి. కాబట్టి అవి నడిచేందుకు సాయపడేలా ఈ పరికరాలను రూపొందిస్తున్నాం. జంతువులకు కూడా భావాలు ఉంటాయి. తోటి జీవులుగా వాటిని చూసుకోవాల్సిన బాధ్యత మనదే. కారు ప్రమాదంలో వెనుక కాళ్లు చచ్చుపడిపోవడంతో లూసీ అనే శునకానికి రబ్బరు చక్రాలను ఉపయోగించి వీల్‌చైర్ రూపొందించాం. ఇప్పుడు అది ఆనందంగా తిరుగుతోంది. మా వాలంటీర్ ఇస్మాయిల్.. ఒక టాయ్ రేస్ కారుకు చెందిన చిన్న చక్రాలను ఉపయోగించి పిల్లుల కోసం కూడా ఇదే విధమైన ఉపకరణాన్ని సృష్టించాడ’ని సులాలా యానిమల్ రెస్క్యూ సొసైటీ తెలిపింది.

Advertisement

Next Story