ఆసియా రెండో అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ!

by Harish |
ఆసియా రెండో అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ!
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీ ఆసియాలోనే రెండో అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. గత కొన్ని నెలలుగా అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్ ధరలు బలంగా ర్యాలీ చేస్తుండటంతో గౌతమ్ అదానీ సంపద భారీగా పెరిగింది. దీంతో చైనాకు చెందిన బిలీయనీర్ జోంగ్ షంషాన్‌ను అధిగమిస్తూ గౌతమ్ అదానీ ఆసియా రెండో అత్యంత ధనవంతుడిగా స్థానం సంపాదించారని బ్లూమ్‌బర్గ్ బిలీయనీర్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చైనా బిలీయనీర్ స్థానంలో ఆసియా అత్యంత ధనవంతుడిగా మారిన సంగతి తెలిసిందే.

బ్లూమ్‌బర్గ్ బిలీయనీర్ ఇండెక్స్ ప్రకారం.. అదానీ సంపద 66.5 బిలియన్ డాలర్లు(రూ. 4.85 లక్షల కోట్లు)కు చేరుకుంది. చైనా బిలీయనీర్ జోంగ్ షంషాన్ సంపద 63.6 బిలియన్ డాలర్లుగా ఉంది. గౌతమ్ అదానీ సంపద ఈ ఏడాదిలో 32.4 బిలియన్ డాలర్లు(రూ. 2.36 లక్షల కోట్లు) పెరిగింది. ఇక, ఆసియా కుబేరుడు ముఖేశ్ అంబానీ రూ. వెయ్యి కోట్లకు పైగా కోల్పోవడంతో మొత్తం సంపద 76.5 బిలియన్ డార్లు(రూ. 5.58 లక్షల కోట్లు)కు చేరుకుంది. బ్లూమ్‌బర్గ్ బిలీయనీర్ ఇండెక్స్ ధనవంతుల జాబితాలో అంబానీ ప్రస్తుతం ప్రపంచంలో 13వ స్థానం, గౌతమ్ అదానీ 14వ స్థానంలో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed