గంగమ్మ ఒడిలోకి చేరుతున్న గణపయ్య

by Shyam |
గంగమ్మ ఒడిలోకి చేరుతున్న గణపయ్య
X

దిశ, తాండూర్ : ఐదు రోజుల పాటు పూజలందుకున్న గణనాథులు నిమజ్జనానికి బయలుదేరారు. మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరులు నిమజ్జనానికి తరలుతున్న భక్తులకు నీటి సౌకర్యం కల్పించడంతో పాటు వినాయక విగ్రహాలపై పూల వర్షం కురిపించారు. శ్రీ సీతారాం పేట్ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో లడ్డూను వేలంపాటలో, అత్యధికంగా ఒక లక్షా అరవై నాలుగు వేల ఒక రూపాయికి తాండూర్ కు చెందిన రొంపల్లి సంతోష్ కైవసం చేసుకున్నారు. తాండూర్ పట్టణ వ్యాప్తంగా సుమారు 700 విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు.

నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు ఐదు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనానికి జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, తాండూర్ డీఎస్పీ, తాండూర్ పట్టణ సీఐ, రూరల్ సీఐ, ఎస్ఐలు నిమజ్జనాన్ని పర్యవేక్షిస్తున్నారు. కోలాట పాటల నడుమ భక్తిపారవశ్యంతో భక్తులు గణనాథుల వెంబడి నిమజ్జనానికి తరలి వెళ్తున్నారు. నిమజ్జనానికి తరలి వస్తున్న వినాయకులకు స్వాగతం పలికేందుకు హిందూ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన సభాస్థలి వద్దకు, ముఖ్యఅతిథిగా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు హజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed