అమెరికా పౌర‌స‌త్వం వ‌దిలి.. మేయర్ పీఠమెక్కి!

by Shyam |   ( Updated:2021-02-11 10:14:05.0  )
అమెరికా పౌర‌స‌త్వం వ‌దిలి.. మేయర్ పీఠమెక్కి!
X

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్ : తండ్రి రాజ‌కీయ వార‌స‌త్వాన్ని అందుకునేందుకు గాను అమెరికా పౌర‌స‌త్వాన్ని సైతం వ‌దులుకుని స్వదేశం తిరిగి వ‌చ్చిన గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి తాను అనుకున్నది సాధించారు. మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల‌లో ఆమె బంజారాహిల్స్ డివిజ‌న్ (93) నుంచి టీఆర్ఎస్ అభ్యర్థినిగా విజ‌య‌ఢంకా మోగించారు. దీంతో నాటి నుంచి ఆమె టీఆర్ఎస్ పార్టీ మేయ‌ర్ అభ్యర్థి అని ప్రచారం జ‌రిగింది. అయితే ఇదే స‌మ‌యంలో తాజా మాజీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ భార్య బొంతు శ్రీదేవి తోపాటు ప‌లువురు పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. దీంతో మేయ‌ర్ పీఠం ఎవ‌రికి ద‌క్కుతుందోన‌ని అంద‌రూ ఎంతో అతృత‌తో ఎదురుచూశారు. ఈ త‌రుణంలో సీఎం కేసీఆర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి పేరును ఖ‌రారు చేయ‌డంతో ఆమె జీహెచ్ఎంసీ నూతన మేయర్‌గా ఎన్నిక లాంఛన‌మే అయింది. టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యస‌భ స‌భ్యుడు, కేసీఆర్ సన్నిహితుడు కేశవరావు కూతురైన విజయలక్ష్మికి మేయ‌ర్ ప‌ద‌వి ద‌క్కడంతో ఆయ‌న‌కు కూడా స‌ముచితంగా గౌర‌వం ఇచ్చిన‌ట్లైంద‌నే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

బాల్యం, విద్యాభ్యాసం..

గ‌ద్వాల విజయలక్ష్మి బాల్యం, విద్యాభ్యాసం మొత్తం అంతా హైదరాబాద్‌లోనే సాగింది. నాంప‌ల్లి ఏసీగార్డ్స్ లోని హోలీ మేరీ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. రెడ్డి మహిళా కాలేజీలో 1985 లో డిగ్రీ చదివారు. కింగ్ కోఠిలోని భారతీయ విద్యాభవన్‌లో జర్నలిజం పూర్తి చేశారు. అనంతరం సుల్తానా ఉల్ లూమ్ లా కాలేజీలో చేరి 2012 లో ఎల్ఎల్‌బీ పూర్తి చేసి అమెరికా వెళ్లారు. అక్కడ ఉన్న సమయంలో అమెరికాలోని ఐదు అతిపెద్ద యూనివర్సిటీల్లో ఒకటైన నార్త్ కరోలినా యూనివర్సిటీలోని కార్డియాలజీ విభాగంలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పని చేశారు. 2007లో భారత్ తిరిగొచ్చిన విజయలక్ష్మి రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని కొనసాగించడం కోసం అమెరికా పౌరసత్వాన్ని సైతం వదిలివేశారు. 2016లో ఆమె టీఆర్ఎస్ తరఫున కార్పొరేటర్‌గా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అప్పటి నుంచి బంజారాహిల్స్ డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. అయితే 2016 లోనే ఆమెకు మేయ‌ర్ ప‌ద‌వి ఇస్తార‌నే ప్రచారం జోరుగా జరిగింది. ఊహించ‌ని విధంగా బొంతు రామ్మోహ‌న్ కు అప్పట్లో మేయ‌ర్ ప‌ద‌విని పార్టీ అధిష్టానం అప్పగించింది. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంత‌రం జీహెచ్ఎంసీకి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న తొలి మ‌హిళా మేయ‌ర్ గా గ‌ద్వాల విజ‌య‌లక్ష్మి గుర్తింపు పొందారు .

Advertisement

Next Story

Most Viewed