వద్దంటున్నా బాట సింగారానికెళ్తున్న ఫ్రూట్ మార్కెట్..!

by Shyam |   ( Updated:2021-08-10 07:31:28.0  )
వద్దంటున్నా బాట సింగారానికెళ్తున్న ఫ్రూట్ మార్కెట్..!
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: 1986 నుంచి కొత్తపేటలోని గడ్డిఅన్నారంలో పండ్ల మార్కెట్ కొనసాగుతున్నది విధితమే. అయితే ఈ మార్కెట్‌తో నగరవాసుల ప్రయాణానికి, రైతులు వాహనాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని.. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కోహెడకు తరలించేందుకు జీవో 397 తీసుకొచ్చింది. దీంతో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి పండ్ల మార్కెట్‌ను కోహెడకు తరలించారు. ఆ సమయంలో కురిసిన వర్షాలకు షెడ్లు అన్ని కూలిపోయి, రైతులు గాయాలపాలైయ్యారు. అప్పుడు తిరిగి యథావిధిగా గడ్డిఅన్నారంలోనే మార్కెట్ నిర్వహాణ జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో కేబినెట్ సమావేశంలో మార్కెట్‌ను తరలించాలని నిర్ణయం తీసుకుంది. ఈ స్థలంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రి నిర్మాణం తక్షణమే చేపట్టేందుకు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగానే గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను బాట సింగారంలోని లాజిస్టిక్ హబ్‌లోకి మార్చేందుకు ప్రభుత్వం, అధికారులు రంగం సిద్ధం చేశారు. లాజిస్టిక్ పార్కు స్థలాన్ని వినియోగించుకుంటున్నందున.. నెలకు రూ.15 లక్షల చొప్పున అద్దె చెల్లించాలని నిర్దేశించింది.

మేము రాలేము.. రావాల్సిందే!

హైదరాబాద్ నలు వైపులా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించాలని గత నెలలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నగరానికి దక్షిణాన కొత్తపేటలోని ఫ్రూట్ మార్కెట్ స్థలంలో ఈ ఆస్పత్రిని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. ఆ మేరకు నిధులు కూడా విడుదల చేసింది. ఈ నిర్ణయంతో అవాక్కయిన కమీషన్ ఏజెంట్లు హైకోర్టు కెక్కారు. కోహెడలో పక్కా నిర్మాణం చేపట్టేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. ఈ వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉండగానే.. నగర శివార్లలో అనేక స్థలాలను పరిశీలించిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ.. అందులో తాజాగా బాటసింగారం లాజిస్టిక్ పార్కు అనువుగా ఉందని తేల్చింది. ఈ మేరకు ఇక్కడకు తరలేందుకు సన్నద్ధం కావాలని స్పష్టం చేసింది. మార్కెట్ తరలింపుపై ఊహించని నిర్ణయంతో అవాక్కయిన కమీషన్ ఏజెంట్లు మార్కెట్లో అత్యవసర సమావేశాలు నిర్వహించుకొని చర్చించుకుంటున్నారు. ఈ సమావేశంలో మార్కెట్ తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ఎన్టీఆర్ నగర్‌, మార్కెట్‌ను బాటసింగారానికి తరలించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed