అవినీతికి కేరాఫ్‌గా ‘రెవెన్యూ ఆఫీసులు’..

by Anukaran |   ( Updated:2020-09-10 23:05:43.0  )
అవినీతికి కేరాఫ్‌గా ‘రెవెన్యూ ఆఫీసులు’..
X

రెండు రోజుల క్రితం ఏసీబీకి పట్టుబడ్డ మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలోనూ అవినీతికి పాల్పడుతూ పలువురు అధికారులు ఏసీబీకి చిక్కినా కొందరి తీరు మారడం లేదు. పైసలిస్తేనే పని జరుగుతుందంటూ బాహాటంగానే చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ గా మారాయని పలువురు విమర్శిస్తున్నారు.

దిశ ప్రతినిధి, మెదక్: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రోజురోజుకూ పెరిగిపోతోంది. దొరికితేనే దొంగ లేదంటే దొర అన్న తీరులో అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది చేతులు తడపనిదే పనులు కావడం లేదు. దీంతో కొందరు బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. కానీ మరికొందరు అడిగినంత ఇచ్చి తమ పనులు చేయించుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల చాలా మంది అధికారుల అవినీతి వెలుగులోకి రావడం లేదు. ఈ అవినీతి అధికారుల కారణంగా రైతులు, సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. పై స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఏ పని చేయాలన్నా ముడుపులు చెల్లించాల్సిందే. ప్రధానంగా రెవెన్యూ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. కొన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో చేతులు తడపనిదే పనులు కావడం లేదని వాస్తవం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దుచేశారు. రెవెన్యూశాఖ లో సమూల మార్పులు చేస్తున్నట్టు ప్రకటించిన రోజే మెదక్ అదనపు కలేక్టర్ నగేష్, ఆర్డీఓ అరుణారెడ్డి, రెవెన్యూశాఖ అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కారు. ఇలా ప్రధానంగా రెవెన్యూ సేవల కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే గ్రామ రెవెన్యూ కార్యదర్శులు(వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ)లు, సర్వేయర్‌లు ఇలా.. ఎవరి స్థాయిలో వారు దొరికినంత దోచుకుంటున్నారు. మ్యుటేషన్‌ పనులు.. సిబ్బందికి ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది.

రైతుల భూ వివరాల విషయంలో..

రైతుల భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో పేర్లు, మార్పులు, చేర్పుల కోసం తహసీల్దారు కార్యాలయాలకు వందల సంఖ్యలో అర్జీలు వస్తున్నాయి. వీటిని గ్రామస్థాయిలో వీఆర్వో, వీఆర్‌ఏ, సర్వేయర్‌లు పరిశీలించిన తర్వాతే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆన్‌లైన్‌లో పేర్లు మార్పులు చేర్పులకు డిప్యూటీ తహసీల్దారు, లేదా తహసీల్దారు యూజర్‌ ఐడీ, డిజిటల్‌ సైన్‌ తప్పనిసరిగా అవసరం. ఇటువంటి పనులు చేసేందుకు రెవెన్యూ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారు. తమ వాటాతో పాటు పై అధికారుల వాటాలను వసూలు చేస్తున్నారు. వివాదాస్పద భూముల విషయంలో భూమి విస్తీర్ణాన్ని బట్టీ ‘మ్యుటేషన్‌’కు సిబ్బంది ధర నిర్ణయిస్తున్నట్టు సమాచారం.

నిబంధనలు గాలికి…

రెవెన్యూ సేవల కోసం ‘మీ-సేవ’ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. నిబంధనల ప్రకారం 30 రోజుల్లోగా వాటికి పరిష్కారం చూపాలి. కానీ వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు కావాలనే ఆ దరఖాస్తుల్లో లోపాలను ఎత్తిచూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తర్వాత అర్జీదారులతో మాట్లాడి పనులు పూర్తిచేసేందుకు రేటు ఫిక్స్ చేసుకుంటున్నారు. రైతు భరోసా పథకం కింద ప్రతి రైతు భూమికీ లబ్ధి చేకూరే అవకాశం ఉంది. దీంతో భూ యాజమాన్యహక్కు కల్పించేందుకు ధరలు నిర్ణయించారు. గతంలో వివాదంలో ఉన్న అర్జీలు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సైతం బయటకు తీసి పనికో రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు.

రెవెన్యూ అధికారులు మాత్రమే కాదు..

కేవలం ఒక్క రెవెన్యూ శాఖలోనే కాదు.. చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. పోలీసు శాఖలో సైతం అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. వివాదాల్లో తలదూర్చి అధికారులు అందిక కాడికి దండుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నా అందులో చాలా తక్కువ మంది అధికారులు అవినీతి బయటపడుతోంది.

ఆరు నెలల క్రితం డీసీపీ..

సుమారు ఆరు నెలల క్రితం సిద్దిపేట అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏసీబీ అధికారులు తనిఖీలు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని నిర్దారించి అతన్ని అరెస్టు చేశారు.

ఉద్యోగంలోంచి తొలగిస్తేనే..

అవినీతికి పాల్పడిన వారిని అధికారులు ముందుగా స్పెండ్ చేసి అనంతరం వారిని తిరిగి విధులకు అనుమతించడంతో అధికారుల్లో భయం ఉండటం లేదని, అవినీతికి పాల్పడే వారిని సస్సెండ్ చేయకుండా ఏకంగా ఉద్యోగం నుంచే పర్మినెంట్ గా తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. దీని వల్ల అధికారుల్లో సైతం భయం పెరుగుతుందని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed