దోస్తానా అంటే వీళ్లదే.. తాగి తలలు పగిలేలా కొట్టుకున్నారు..

by Anukaran |   ( Updated:2021-10-30 10:41:41.0  )
దోస్తానా అంటే వీళ్లదే.. తాగి తలలు పగిలేలా కొట్టుకున్నారు..
X

దిశ, కామారెడ్డి : తాగిన మైకంలో ఇద్దరి వ్యక్తుల మధ్య ఫోన్ కోసం జరిగిన గొడవ.. రాళ్లు, రాడ్లతో పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలోని హరిజన వాడలో శనివారం వెలుగుచూసింది. బాధితులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడలో నివాసం ఉంటున్న రామంచ ప్రసాద్, కొత్తపల్లి శ్యామ్ ఇద్దరు ఒకచోట కూర్చుని మద్యం సేవిస్తున్నారు.

ఈ క్రమంలోనే శ్యామ్‌కు చెందిన మొబైల్ ఫోన్‌ను ప్రసాద్ దొంగిలించాడు. ఫోన్ ఎందుకు తీశావని శ్యామ్ ప్రశ్నించగా ఇరువురి మధ్య ఘర్షణ మొదలైంది. దాంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న శ్యామ్ సోదరుడు భూమయ్య ఘటనా స్థలికి చేరుకోవడంతో ఒకరిపైఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు. రాళ్లు, రాడ్లతో దాడులు చేసుకోగా ప్రసాద్, భూమయ్య తలలు పగిలాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు తనపై కావాలనే దాడికి పాల్పడ్డారని ప్రసాద్ చెబుతున్నాడు. దాడి అనంతరం ఒకరిపై ఒకరు కామారెడ్డి పట్టణ పోలీసు‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. జిల్లా ఆస్పత్రిలో ఇరువురికి చికిత్స కొనసాగుతోంది.

Advertisement

Next Story