పిట్ట కొంచెం కూత ఘనం.. వరల్డ్ రికార్డులు ‘శ్రీనిత’ సొంతం

by Sridhar Babu |
పిట్ట కొంచెం కూత ఘనం.. వరల్డ్ రికార్డులు ‘శ్రీనిత’ సొంతం
X

దిశ, కాటారం : పిట్ట కొంచెం కూత ఘనం సామెతకు ఈ చిన్నారి సరిగ్గా సరిపోతుంది. నాలుగేళ్ల ఏడు నెలల 11 రోజులు ఉన్న చిన్నారి పులి శ్రీనిత తన ప్రతిభా పాటవాలతో ప్రపంచ రికార్డు బుక్కుతో పాటు ఇతర ప్రతిష్ఠాత్మకమైన రికార్డులను కైవసం చేసుకుంది. అసాధారణ రికార్డును సాధించి ప్రపంచ రికార్డ్ హోల్డర్‌గా నిలిచింది. 118 పీరియాడిక్ టేబుల్ ఆవర్తన పట్టికను కేవలం 49 సెకండ్లలో వినిపించి రికార్డు తన పేరు మీద సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఒకటా.. రెండా.. ఏకంగా ఐదు రికార్డుల్లో తన పేరును లఖించుకున్నది. జూలై 15న గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ (నోయిడా), జూలై 16న ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( న్యూఢిల్లీ ), ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ( ఫరీదాబాద్ ), కలాం ప్రపంచ రికార్డు ( చెన్నై), తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ (హైదరాబాదు )లో ఇలా సుస్థిరమైన రికార్డులను తన ఖతాలో వేసుకుంది. శ్రీనిధి బెంగుళూరులోని హెల్త్ కిడ్స్ యూకేజీలో చదువుతోంది.

పెద్దపల్లి జిల్లా కాటారం మండల కేంద్రానికి చెందిన పులి సత్యనారాయణ, తల్లి అర్చనల ముద్దుల సంతానమే శ్రీనిత. వృత్తి రీత్యా తండ్రి సత్యనారాయణ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్నారు. తన కుమార్తెలోని ప్రతిభను చిన్నతనంలోనే పేరెంట్స్ గుర్తించడంతో ప్రపంచ రికార్డ్స్ లో శ్రీనిత పేరు నమోదైంది. శ్రీనిత రికార్డుల గురించి తల్లిదండ్రుల మాట్లాడుతూ.. శ్రీనితకు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఎప్పటికప్పుడు ఆసక్తిని కనబరుస్తుందన్నారు. అలాగే, ఆమె అడిగే ప్రశ్నలను ఓపికగా విని.. సంతృప్తి చెందే వరకు ఉదాహరణలతో సమాధానాలను ఇస్తామని ఇది మాకు రోజు వారి దినచర్యగా మారిందన్నారు. పిల్లలలో సహజమైన లేదా దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడం మన కర్తవ్యమని చెప్పారు. తమ కూతురు కేవలం ఒక నెల వ్యవధిలో ఆవర్తన పట్టికను నేర్చుకున్నట్లు వివరించారు. శ్రీనిత ప్రపంచ రికార్డును కైవసం చేసుకోవడంతో కాటారం గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed