కాంగ్రెస్‌లో విషాదం.. కరోనాతో ఆర్ఎల్ భాటియా మృతి

by Anukaran |   ( Updated:2021-05-15 00:13:02.0  )
కాంగ్రెస్‌లో విషాదం.. కరోనాతో ఆర్ఎల్ భాటియా మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌ దేశంలో విలయతాండవం చేస్తూ.. సామాన్యుల నుంచి రాజకీయ నేతలు, సెలబ్రిటీలను సైతం పొట్టనపెట్టుకుంటుంది. తాజాగా కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి, కాంగ్రెస్ కురువృద్ధుడు ఆర్‌ఎల్ భాటియా(రఘునందన్ లాల్ భాటియా) కరోనా వైరస్‌తో మరణించారు. కరోనా పాజిటివ్ రావడంతో పంజాబ్ అమృత్‌సర్‌లోని స్థానిక ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆర్ఎల్ భాటియా(99) శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారని అమృత్‌సర్ వెస్ట్ ఎమ్మెల్యే(కాంగ్రెస్) రాజ్‌ కుమార్ తెలిపారు. దహన సంస్కారాలు శనివారం ఉదయం 11.30 గంటలకు జరుగుతాయని స్పష్టం చేశారు.

ఆర్‌ఎల్ భాటియా రాజకీయ ప్రస్థానం..

1972లో ఆర్ఎల్ భాటియా అమృత్‌సర్ నుంచి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1980, 1985, 1992, 1996, 1999 ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా గెలిచారు. 1975-77 వరకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక కమిటీ సభ్యునిగా పనిచేశారు. 1983 లో లోక్‌సభలో పిటిషన్ల కమిటీకి చైర్మన్, 1982-84 వరకు పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, 1991లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, 1992లో రాజ్యాంగ సవరణ కోసం ఏర్పాటు చేసిన సెలెక్ట్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేసిన అనుభజ్ఞుడు ఆర్ఎల్ భాటియా. ఆ తర్వాత జూన్ 23, 2004 నుంచి జూలై 10, 2008 వరకు కేరళకు 16వ గవర్నర్‌గా.. జూలై 10, 2008 నుంచి జూన్ 28, 2009 వరకు బీహార్‌కు కూడా గవర్నర్‌గా పనిచేశారు.

Advertisement

Next Story