ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

by Anukaran |   ( Updated:2020-08-31 08:37:48.0  )
ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కన్నుమూశారు. కరోనాతో ఈనెల 10న ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ఆయన… చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ప్రకటించారు. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తోడవ్వడంతో డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ క్రమంలోనే డీప్ కోమాలోకి వెళ్లిన ప్రణబ్ చనిపోయారు.

ప్రణబ్ జననం…

1935, డిసెంబర్ 11న బెంగాల్ బిర్భుమ్ జిల్లా మిరాఠిలో ప్రణబ్ ముఖర్జీ జన్మించారు. ప్రణబ్ తండ్రి కెకె. ముఖర్జీ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. కోల్ కతా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్‌బీ పట్టా అందుకున్న ప్రణబ్… 1957, జులై 13న సువ్రా ముఖర్జీని పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. 2015లో అనారోగ్యంతో ప్రణబ్ సతీమణి సువ్రా ముఖర్జీ చనిపోయారు. ఇందిరా, రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహరావు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల్లో కీలక మంత్రిత్వశాఖల్లో ప్రణబ్ బాధ్యతలు నిర్వహించారు.

క్లర్క్‌గా పనిచేసిన ప్రణబ్….

డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో అప్పర్ డివిజన్‌ క్లర్క్‌గా ప్రణబ్ ముఖర్జీ పనిచేశారు. 1963లో విద్యానగర్ కళాశాలలో అధ్యపకుడిగా పనిచేసి పాఠాలు బోధించారు. బెంగాలీ పత్రిక దెషర్ దక్‌లో పాత్రికేయుడిగా పనిచేసిన అనుభవం ప్రణబ్‌కు ఉంది.

1969లో రాజకీయాల్లోకి..

1969లో రాజకీయాల్లోకి వచ్చిన ప్రణబ్‌ను ఇందిరాగాంధీ రాజ్యసభకు పంపారు. అత్యంత నమ్మకస్తుడిగా మారడంతో 1973లో ఇందిర మంత్రివర్గంలో ప్రణబ్‌కు స్థానం లభించింది. 1982లో 47ఏళ్ల వయస్సుల్లో ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశంలో అత్యంత పిన్నవయస్కుడిగా బాధ్యతలు చేపట్టిన ఆర్థికమంత్రిగా ప్రణబ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందిరా గాంధీ తర్వాత రాజీవ్‌గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో రాష్ట్రీయ సమాజ్ వాదీ కాంగ్రెస్ పేరుతో సొంత పార్టీ పెట్టారు. కొన్నాళ్లకు ప్రణబ్‌కు .. రాజీవ్ గాంధీతో సయోధ్య కుదరడంతో 1989లో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

ప్రణాళిక సంఘం ఉపాధ్యకుడిగా…

1991లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ నర్సింహరావు ప్రభుత్వంలో ప్రణబ్ ముఖర్జీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1995లో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1998లో సోనియా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టేలా ఒప్పించడంలో కీలక పాత్ర పోషించిన ప్రణబ్.. 2004 నుంచి 2012 వరకు విదేశీ, రక్షణ, ఆర్థికశాఖ బాధ్యతలు చూశారు.

ఆరు దశాబ్దాల రాజకీయ జీవితం

ప్రణబ్ ముఖర్జీ తన ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో గౌరవ డాక్టరేట్‌లు, పదవులు చేపట్టారు. 2012నుంచి 2017 జులై వరకు దేశ 13వ రాష్రపతిగా పనిచేశారు. 2008లో పద్మ విభూషణ్, 2019లో భారత రత్న పురస్కారాలతో ప్రణబ్‌ను కేంద్ర ప్రభుత్వం గౌరవించింది.

Advertisement

Next Story

Most Viewed