చంద్రబాబుతో మాజీమంత్రి గంటా శ్రీనివాస్ భేటీ

by Anukaran |
ganta chandra babu
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నంలో పర్యటిస్తున్న చంద్రబాబును గంటా మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైనప్పటి నుంచి ఆయన మౌనంగా ఉన్నారు. ఇటీవలే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయోద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.

బుధవారం ఆయన ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గంటా కూడా త్వరలోనే వైసీపీలో చేరతారంటూ చెప్పుకొచ్చారు. సీఎం జగన్ వద్ద కొన్ని ప్రతిపాదనలు పంపారని అవి క్లారిటీ అయితే వైసీపీలోకి వచ్చేస్తారని చెప్పుకొచ్చారు. అయితే విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను గంటా శ్రీనివాసరావు ఖండిచారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని ఒకవేళ వేరే పార్టీలోకి వెళ్తే ప్రజలకు చెప్పే వెళ్తానని స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో చంద్రబాబుతో గంటా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై గంటా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story