పాఠశాలను చూసి షాకైన అధికారి.. మరీ ఇంత ఘోరమా..

by Aamani |
పాఠశాలను చూసి షాకైన అధికారి.. మరీ ఇంత ఘోరమా..
X

దిశ, కామారెడ్డి : ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటున్న తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని సోషల్ డెమొక్రటిక్ ఫోరమ్ ప్రతినిధి మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. తరగతి గదులు, టాయిలెట్స్, తాగునీటి వసతులపై ఆరా తీశారు. పాఠశాలల పెచ్చులూడి పోయి, కూర్చోవడానికి బల్లలు కూడా లేని పరిస్థితిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. గోడలకు క్రాక్స్ వచ్చాయని, బ్లాక్ బోర్డులు కూడా సరిగా లేవని, పుస్తకాలు పెట్టుకోవడానికి కూడా టేబుల్స్ లేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ధనిక తెలంగాణలో 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణలో పాఠశాలల పరిస్థితులు ఇలా ఉన్నాయా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శనివారం తాడ్వాయి మండలం పలుగడ్డ పాఠశాలలో పల్లె నిద్ర చేసామని, ఆ పాఠశాల కూలిపోయి చెట్ల కింద పాఠాలు కొనసాగుతుందన్నారు. ఆ పాఠశాలకు కనీస మరమ్మత్తులు లేవని, నూతన భవనం నిర్మించాలన్న ఆలోచన కూడా లేదని, అసలు ఈ పాఠశాల మాది కాదు అన్న ధోరణిలో ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితులు ఉన్నాయన్న ఆయన పొరుగు రాష్ట్రాలను చూసి పాఠశాలలపై ఎందుకు ఈ ప్రభుత్వం ఫోకస్ చేయడం లేదని ప్రశ్నించారు.

ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలపై నిధులు ఖర్చు చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నారని చెప్పారు. ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా ఉందన్నారు. ఏడున్నరేళ్లలో స్కూల్ ఎడ్యుకేషన్ మీద సీఎం కేసీఆర్ ఒక్కరోజు కూడా రివ్యూ చేసిన దాఖలాలు కనిపించలేదన్నారు. ఒక్క రూపాయి కూడా పాఠశాలలకు వెచ్చించిన సందర్భాలు కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు వెళ్ళామా, వచ్చామా అన్నట్టు విద్యార్థుల పరిస్థితి ఉందన్నారు. పాఠశాలల అభివృద్ధి కోసం 6, 7 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. 2 లక్షల కోట్ల బడ్జెట్ లో ఈ నిధులు పెద్ద విషయం కాదని తెలిపారు.

ఢిల్లీలోని ప్రభుత్వం పాఠశాలలపై 30 శాతం బడ్జెట్ కేటాయిస్తుందని, తెలంగాణలో కేవలం 5.8 శాతం మాత్రమే బడ్జెట్ కేటాయిస్తుందని పేర్కొన్నారు. కనీసం 20 శాతం బడ్జెట్ ప్రభుత్వ పాఠశాలలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతులు లేవని, తరగతులకు తగినట్టుగా ఉపాధ్యాయులు లేరని తెలిపారు. పిల్లలు రావడం లేదన్న సాకుతో పాఠశాలలను మూసి వేస్తున్న ప్రభుత్వం, పాఠశాలలకు పిల్లలు ఎందుకు రావడం లేదో ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. అడగనిదే అమ్మకుడా అన్నం పెట్టదని, మనం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలన్నారు. లేకపోతే ప్రభుత్వం మొద్దు నిద్రలోనే ఉంటుందని తెలిపారు. సోషల్ డెమొక్రటిక్ సొసైటీ ఆధ్వర్యంలో పాఠశాలల పరిస్థితులను పరిశీలించడం జరుగుతుందని, కామారెడ్డి జిల్లా నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. బంగారు తెలంగాణలో పాఠశాలల పరిస్థితి ఈ విధంగా ఉండటం బాధాకరమని, ఈ పరిస్థితులు మారాలని పేర్కొన్నారు.

Advertisement

Next Story