బీజేపీకి జై.. కాంగ్రెస్‌కు నై : ఈటల రాజేందర్

by Sridhar Babu |
బీజేపీకి జై.. కాంగ్రెస్‌కు నై : ఈటల రాజేందర్
X

దిశప్రతినిధి, కరీంనగర్ : తన భవిష్యత్ కార్యాచరణపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏ పార్టీతో జత కడ్తారోనన్న విషయంపై జరుగుతున్న చర్చకు పుల్‌స్టాప్ పెట్టేశారు. శుక్రవారం శామీర్ పేట్‌లోని తన నివాసంలో జరిగిన ప్రెస్‌మీట్ అనంతరం మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. వారం రోజుల్లో బీజేపీ కండువా కప్పుకుంటానని ప్రకటించారు. తాను ఢిల్లీలోనే పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.

2018లో తనను టీఆర్ఎస్ వాళ్లే ఓడించాలని ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. హుజురాబాద్ నుండి తనను ఓడించి రాజకీయంగా దెబ్బకొట్టాలనుకున్నప్పటికీ తిరిగి అసెంబ్లీకి ఎన్నిక కావడంతో వ్యతిరేకులకు మింగుడు పడకుండా తయారైందని ఈటల కుండబద్దలు కొట్టారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకులను సమీకరించే అవకాశాలు ఉన్నట్టుగా సూత్ర ప్రాయంగా చెప్పారు. బీజేపీలో చేరిన తరువాత ఇంకా చాలా మంది అసంతృప్తులు టీఆర్ఎస్‌ను వీడే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడానికి కారణాలను కూడా రాజేందర్ వివరించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎవరి కనుసన్నల్లో నడుస్తుందో అందరికీ తెలుసన్నారు. దీంతో ఇప్పటివరకు ఈటల రాజేందర్ ఏ పార్టీవైపు వెళ్తారోనన్న ఊహాగానాలకు తెరపడినట్టయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈటల తమ పార్టీలోకే వస్తారని రానున్న రెండు మూడు రోజుల్లో సమీకరణాలు మారతాయని కూడా వ్యాఖ్యానించిప్పటికీ ఈటల మాత్రం బీజేపీలో చేరాలని డిసైడ్ చేసుకున్నట్టు స్పష్టమైంది.

Advertisement

Next Story