TTD జంబో బోర్డును రద్దు చేయండి : చంద్రబాబు

by srinivas |
TTD జంబో బోర్డును రద్దు చేయండి : చంద్రబాబు
X

దిశ, ఏపీబ్యూరో : తిరుమల శ్రీవారి ప్రతిష్ఠను దెబ్బతీస్తే భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి వస్తుందని సీఎం వైఎస్ జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. టీటీడీపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ రాశారు. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 81మందితో జంబో బోర్డు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. వ్యాపార ధోరణి, రాజకీయ ప్రయోజనాలతోనే జంబో బోర్డు ఏర్పాటు చేశారని చంద్రబాబు ఆరోపించారు.

ఆధ్యాత్మిక చింతనకు, సనాతన హైందవ ధర్మానికి ప్రతీక అయిన తిరుమల పుణ్యక్షేత్రాన్ని వ్యాపార సంస్థగా మార్చడం శోచనీయమన్నారు. భక్తి భావం, సేవా స్ఫూర్తి కలిగిన వారితో ఏర్పాటవ్వాల్సిన టీటీడీ పాలకమండలిలో పారిశ్రామికవేత్తలు, అవినీతిపరులు, నేరస్థులు, కళంకితులకు చోటు కల్పించారంటూ చంద్రబాబు మండిపడ్డారు. జంబో బోర్డు ఏర్పాటును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రాజకీయ నిరుద్యోగులకు టీటీడీను కేంద్రంగా మార్చారంటూ ధ్వజమెత్తారు. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన జంబో బోర్డును తక్షణమే రద్దు చేసి నూతన పాలకమండలిని ఏర్పాటు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story