కోపం మామీద.. కక్ష సాధింపు వాళ్లపైన : చంద్రబాబు

by srinivas |
Chandrababu
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీపై కోపంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల పొట్ట కొడుతోందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. పేద ప్రజల గృహ అవసరాల కోసం నాడు తమ టీడీపీ ప్రభుత్వం 29.52 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని అన్నారు. అందులో 9.10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి 3 దశల్లో 8 లక్షల గృహప్రవేశాలు కూడా చేయించిందని ఆయన అన్నారు. తాము అధికారంలో ఉండగా మరో 20.41 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ఇళ్లతో పాటు మరో 4.02 లక్షల మందికి 7,475 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామని ఆయన చెప్పారు. అయితే, గత ఏడాదిగా వీటి పనులన్నీ ఆపేశారని, టీడీపీపై అక్కసుతో పూర్తైన ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వకుండా కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో పేదల ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ కుంభకోణంలా మారిందన్న ఆయన, ఎకరా కనీసం రూ.7 లక్షలు విలువ చేయని భూములను రూ.45 లక్షల నుంచి రూ.70 లక్షలకు కొనిపించి దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో ప్రతి నియోజకర్గంలో కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. గోదావరి జిల్లాల్లోని ఆవ భూముల్లోనే రూ.400 కోట్ల కుంభకోణం జరిగినట్టు నిజనిర్ధారణ కమిటీ వెల్లడించిందని ఆయన చెప్పారు. దీనికి తోడు ఇళ్ల పేరిట పేదల నుంచి వసూళ్ల దందాకు వైఎస్సార్సీపీ తెరలేపిందని ఆయన మండిపడ్డారు. ఇళ్ల స్థలం కావాలంటే 30 వేలు, 60 వేలు, 1.5 లక్షలు చెల్లించాలంటూ వైఎస్సార్సీపీ నేతలు గ్రామానికో రేటు, గ్రామానికి దగ్గర్లో ఒకరేటు, దూరంగా మరోరేటు నిర్ణయించి దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆఖరుకి పేదల సంక్షేమంలో కూడా దోపిడీకి పాల్పడిన చరిత్ర వైఎస్సార్సీపీదేనని ఆయన విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed