AP News:రాష్ట్రంలో కొత్తగా 4 లైన్ల హైవే.. ఆ జిల్లా వాసులకు పండగే!

by Jakkula Mamatha |   ( Updated:2024-12-24 01:45:41.0  )
AP News:రాష్ట్రంలో కొత్తగా 4 లైన్ల హైవే.. ఆ జిల్లా వాసులకు పండగే!
X

దిశ ప్రతినిధి,గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లా వాసుల కల త్వరలో నెరవేరబోతోంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నాలుగు లైన్ల రోడ్డు రెండేళ్లలో పూర్తి కాబోతోంది. గుంటూరు-హైదరాబాద్‌ మార్గంలో కీలకంగా ఉన్న కొండమోడు-పేరేచర్ల నేషనల్ హైవే నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టు సంస్థ ఒప్పందం చేసుకుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా విభాగమైన ఈఎన్‌సీతో రాజేంద్రసింగ్‌ బేంబూ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఒప్పందం చేసుకుంది. ఇందుకు సంబంధించి నవంబర్ 5న కేంద్రం ఆ కాంట్రాక్టు సంస్థకు లేఖ రాసింది. ఈ మేరకు స్పందించిన సంస్థ ఒప్పంద ప్రక్రియను పూర్తి చేసింది.

రెండేళ్లలో పూర్తి..

కొండమోడు-పేరేచర్ల నేషనల్ హైవే నాలుగు లైన్ల రహదారి నిర్మాణాన్ని కాంట్రాక్టు సంస్థ రెండేళ్లలో పూర్తి చేయనుంది. ఆ తర్వాత ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యత కూడా ఆ కాంట్రాక్టు సంస్థదే. దీంతో త్వరలోనే పనులు మొదలవనున్నాయి. ఇదంతా నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు,లోక్ సభలో టీడీపీ సభా నాయకుడు లావు శ్రీ కృష్ణదేవరాయలు కృషి అని చెప్పుకోవాలి. ఈ నాలుగు లేన్ల ప్రాజెక్టు పూర్తయితే, అమరావతి నుంచి హైదరాబాద్‌కు త్వరగా వెళ్లొచ్చు. ఇందుకు కనెక్టివిటీగా మేడికొండూరులో 5 కి.మీ, సత్తెనపల్లిలో 11 కి.మీ బైపాస్‌ నిర్మాణం కూడా చేపట్టనున్నారు. త్వరలో పనులు ప్రారంభించే ఈ పేరేచర్ల- కొండమోడు నాలుగు లైన్ల రోడ్డు దూరం 49.9 కి.మీ కాగా.. భూసేకరణ, ఇతర పని విలువ అంచనా రూ.881.61 కోట్లు అని సమాచారం.

Advertisement

Next Story