బీజేపీలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ?

by srinivas |
బీజేపీలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీ ఎదుగుదలే టార్గెట్‌గా పావులు కదుపుతున్న బీజేపీ ఆ దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ, వైసీపీలో అసంతృప్త నేతలను చేర్చుకొని బలపడేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ దూసుకెళ్తోంది. ఇందులో భాగంగానే జనసేన మాజీ నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను పార్టీలోకి తీసుకువచ్చేందుకు రంగంలోకి దిగింది. శనివారం ఉదయం బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి.. లక్ష్మీనారాయణతో సమావేశమై రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. భేటీ అద్భుతంగా జరిగిందని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య భేటీ ఏపీ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారి.. లక్ష్మీ నారాయణ బీజేపీలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది.

లక్ష్మీనారాయణ జనసేనలో ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ సినిమాలు చేస్తానని ప్రకటన చేయడంతో ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించి పార్టీకి గుడ్‌ బై చెప్పారు. అప్పటి నుంచి ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడలేదు. కనీసం ప్రెస్‌మీట్లలో సైతం కనిపించలేదు. దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డితో భేటీ కావడం రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. త్వరలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని జాతీయ స్థాయిలో చర్చ మొదలు కావడం, ఏపీలోనూ బీజేపీ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తుండటంతో లక్ష్మీనారాయణ త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి.

అయితే తాను వీడి వచ్చిన జనసేన పార్టీ ప్రస్తుతం ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నందున.. లక్ష్మీనారాయణ బీజేపీలో చేరుతారా ? పవన్ కల్యాణ్‌తో వేదిక పంచుకుంటారా అన్నది కీలకంగా మారింది. ఇప్పటికే కాపు నేత ముద్రగడతో బీజేపీ స్టేట్ చీఫ్ సోమువీర్రాజు చర్చలు జరపగా.. ఇప్పుడు లక్ష్మీనారాయణతో విష్ణువర్ధన్‌రెడ్డి చర్చలు జరిపారు. ఒకవేళ ముద్రగడ బీజేపీలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తే ఇద్దరినీ ఒకేసారి పార్టీలోకి ఆహ్వానించి రాజకీయాల్లో వేడిని రగలిస్తుందా అన్నది సైతం పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది. మరీ లక్ష్మీనారాయణ ఎలాంటి డిసీషన్ తీసుకొని ఏవిధమైన స్టెప్ వేస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది.

Advertisement

Next Story