ఫోర్డ్, మహీంద్రాల జాయింట్ వెంచర్ రద్దు!

by Harish |
ఫోర్డ్, మహీంద్రాల జాయింట్ వెంచర్ రద్దు!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నందున మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం)తో దేశీయంగా జాయింట్ వెంచర్ ఆలోచనను విరమించుకుంటున్నట్టు ఫోర్డ్ మోటార్ వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో విక్రయించేందుకు తక్కువ వ్యయంతో వాహనాల తయారీని చేపట్టాలని 2019లో ఎంఅండ్ఎం, ఫోర్డ్ కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. మీడియం ఎస్‌యూవీల తయారీని అభివృద్ధి చేయాలని, అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల తయారీని కూడా చేపట్టాలని ఇరు కంపెనీలు భావించాయి. అయితే, అంతకుముందు ఏడాదిలో ఆర్థికవ్యవస్థలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, 2020లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో జాయింట్ వెంచర్ ఆలోచనను విరమించుకుంటున్నట్టు ఇరు కంపెనీలు వేర్వేరు ప్రకటనలు చేశాయి.

కరోనా వల్ల ఇరు కంపెనీలు జాయింట్ వెంచర్‌కు అవసరమైన మూలధన కేటాయింపుల కోసం ఇబ్బందులు ఎదుర్కొనడంతో వెనక్కి తగ్గాయి. 2020, అక్టోబర్ నుంచి వ్యాపార వాతావరణంలో అనేక మార్పులు జరిగాయని, డిసెంబర్ 31తో గడువు ముగుస్తున్న కారణంగా జాయింట్ వెంచర్‌ను వద్దనుకుంటున్నట్టు ఫోర్డ్ మోటార్ ప్రతినిధి టీఆర్ రీడ్ చెప్పారు. ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో వీటి అభివృద్ధికి అనుగుణంగా ప్రత్యేక నిధుల అవసరం పెరిగింది. ఈ ఒత్తిడి వల్లే పలు కంపెనీలు విలీనం వైపుగా వెళ్తున్నాయి. ఇటీవల ఫియట్ క్రిస్లర్, పీఎస్ఏ విలీనమయ్యాయి. మహీంద్రాతో భాగస్వామ్యంతో వాహన వ్యయాలను తగ్గించుకోవాలని ఫోర్డ్ భావించింది.

Advertisement

Next Story