కిడ్నీ పేషెంట్ కోసం.. పూలు అమ్మి డబ్బులు సేకరించిన చిన్నారి

by Shyam |
kerala girl
X

దిశ, ఫీచర్స్: సాయం చేయమంటూ చేయి చాచినా ముఖం పక్కకు తిప్పుకునిపోయే ఈ రోజుల్లో.. ఒకరి అవసరం మరొకరికి అనవసరం. ఒకరి బాధ మరొకరి నవ్వులాట. కానీ అందరూ ఇలానే ఆలోచించరు. మానవత్వంతో తోటివారికి సాయపడేవారు కూడా ఉంటారు. పదుగురి బాధలో భాగం పంచుకుని, కష్టాలను గట్టెక్కించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. కేరళలోని పట్టిక్కడ్‌కు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి ఒలీవియా కూడా ఆ కోవకు చెందినదే. ఆ చిన్నారి నివసించే వీధిలోనే ఉంటున్న సునీల్ కుమార్ కిడ్నీసమస్యతో బాధపడుతున్నాడు. ‘అంకుల్’ అంటూ ప్రేమగా పిలుచుకునే సునీల్‌కు ఆ పరిస్థితి రావడంతో ఒలీవియా బాధపడింది. అతడి పరిస్థితి గమనించి ‘విరాళా’లు సేకరించి మానవత్వాన్ని చాటుకుంది. ఈ మేరకు చిన్న వయసులోనే గొప్ప మనసున్న వ్యక్తిగా అభినందనలు అందుకుంది.

సునీల్ కుమార్ భార్య ఇటీవలే రొమ్ము క్యాన్సర్ సమస్యతో ఇబ్బంది పడగా, ఆమె చికిత్స కోసమే తన దగ్గరున్న డబ్బంతా ఖర్చు చేశాడు. దీంతో తనకు కిడ్నీ సమస్య ఉన్నా, కనీసం మందులు కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. ఇది గమనించిన చిన్నారి ఒలీవియా వారికి తన వంతు సాయం చేయాలనుకుంది. కానీ తన తండ్రి ఓ ఆటో రిక్షా కార్మికుడు. అతని దగ్గర కూడా అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఉండవు. ఈ క్రమంలోనే ఒలీవియా ఓ కొత్త ఐడియాతో ముందుకొచ్చింది. విషు పండగ రోజున దేవుడి పూజ కోసం తప్పకుండా కనిక్కొన్న పూలను కొంటారు. ఈ నేపథ్యంలోనే ఒలీవియా ఆ పూలను సేకరించి మార్కెట్‌లో ‘కనిక్కొన్న ఫర్ సేల్.. ఈ పూలు అమ్మగా వచ్చిన డబ్బును ఓ కిడ్నీ పేషెంట్ ట్రీట్‌మెంట్ కోసం ఉపయోగిస్తాం’ అనే బోర్డు పెట్టి విక్రయించి రూ. 1850 సంపాదించింది. ఇది పెద్ద అమౌంట్ కాదు కానీ, సునీల్‌ మందులు కొనుక్కోవడానికైనా ఈ డబ్బులు ఉపయోగపడతాయి. మనసుంటే మార్గం ఉంటుందని నిరూపించిన ఈ చిన్నారి.. తను చేసిన పనితో అందరికీ కనువిప్పు కలిగించింది. ఆపదలో ఉన్న ఓ మనిషిని ఆదుకోవాలనే మంచి సందేశాన్ని అందించింది.

Advertisement

Next Story

Most Viewed