గాంధీ భవన్‌లో తినేటోళ్లు లేరట..

by Anukaran |   ( Updated:2020-11-27 09:34:36.0  )
గాంధీ భవన్‌లో తినేటోళ్లు లేరట..
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. వారిని ఆపేందుకు రాష్ట్ర నాయకత్వం ఎంత ప్రయత్నించినా ప్రతిఫలం కనిపించడం లేదు. దీంతో పార్టీని ముందుండి నడిపించేవాళ్లు లేక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.

ఇదంతా ఓ వైపయితే, గాంధీభవన్‌లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసినా తినేవాళ్లు లేక కాంట్రాక్టర్ వెళ్లిపోయాడని తెలుస్తోంది. పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు కూడా అటువైపు రావడం లేదని టాక్ వినిపిస్తోంది. రోజుకు వంద మందికి భోజనాలు ఏర్పాటు చేస్తే, ప్రస్తుతం యాభై మంది కూడా తినడం లేదని సమాచారం. దీంతో క్యాటరింగ్ యజమాని వదిలేసి వెళ్లిపోయాడంటూ వాపోతున్నారు.

గ్రేటర్ ఫలితాలకు ముందే గాంధీభవన్ కళతప్పింది. కేడర్ లేకపోవడం, ఇప్పటికే గ్రేటర్లో పట్టున్న నేతలంతా పార్టీని వీడటంతో పాటు గ్రేటర్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ అలకబూనారు. తన వర్గానికి టికెట్లు ఇవ్వలేదంటూ ప్రచారానికే అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కొంతమేరకు గ్రేటర్ కాంగ్రెస్లో పట్టున్న విక్రంగౌడ్ అధిష్టానంపై సంచలన ఆరోపణలు చేస్తూ కాషాయం కండువా కప్పుకున్నారు. నేతలంతా వరుసగా పార్టీని వీడటం, మరికొంతమంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో గాంధీభవన్ వైపు నేతలు రావడమే తగ్గిపోయింది. హై పవర్ మీడియా కమిటీని వేసిన టీపీసీసీ… రోజుకో ఇద్దరు, ముగ్గురుతో ప్రెస్ మీట్ నిర్వహిస్తోంది.

దీంతోనైనా పార్టీ నేతలు గాంధీభవన్ కు వస్తారని భావించారు. కానీ ప్రెస్ మీట్ నిర్వహించే నేతలు మినహా కార్యకర్తలు, అనుచరవర్గం అటువైపు రావడం లేదు. దీంతో పార్టీ శ్రేణులకు తీసుకువస్తున్న భోజనాలు మొత్తం మిగిలిపోతున్నాయి. భోజనాలు మిగిలిపోతుండటంతో క్యాటరింగ్ కాంట్రాక్టర్లు తాము నష్టపోతున్నా మంటూ భోజనాలు పంపడం ఆపేస్తామని వార్నింగ్ ఇచ్చినట్టు గాంధీభవన్ వర్గాల సమాచారం.

Advertisement

Next Story

Most Viewed