సలాం.. కరోనా వారియర్స్..

by Shyam |
సలాం.. కరోనా వారియర్స్..
X

– ‘బే ఆఫ్ బెంగాల్’లో నావికాదళ ప్రదర్శన

– గాంధీ ఆస్పత్రిలో కురిసిన పూలవర్షం

దిశ, న్యూస్ బ్యూరో: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ -19)పై పోరులో అవిశ్రాంతంగా పోరాడుతున్న కరోనా వారియర్స్‌కు అరుదైన గుర్తింపు లభిస్తోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలతో భారత్ తనదైన ముద్ర వేసింది. ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలను అమలు చేయడంలో వైద్యులు, నర్సులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్, పోలీసు శాఖ సమర్థవంతంగా పోరాడుతోంది. వీరందరిని కలిపి ‘‌కరోనా వారియర్స్’ గా పేర్కొంటూ గౌరవిస్తున్నారు. ఆదివారం వీరందరికీ త్రివిధ దళాలు వేర్వేరు చోట్ల ప్రదర్శనలు, అభినందనలతో సంఘీభావం ప్రకటించాయి. కరోనా వారియర్స్‌కు సంఘీభావం ప్రకటించేందుకు మద్దతు నిలవాలని త్రివిధ దళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం సాయుధ దళాల బృందాలు పలుచోట్ల సంఘీభావ ప్రదర్శనలు చేపట్టాయి.

ఢిల్లీ పోలీస్‌ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి సమర్పించి వందన సమర్పరణ అనంతరం పలుచోట్ల కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పోలీసు సేవలకు ప్రశంసగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన చాపర్‌ పోలీస్‌ వార్‌ మెమోరియల్‌పై పూలవర్షం కురిపించింది. ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో ఉన్న పట్టణాల్లో కొవిడ్ ఆస్పత్రులపై వాయుసేన పూలవర్షం కురిపించింది. కరోనా వారియర్స్‌కు సెల్యూట్ అంటూ భారత నావీదళం ఐఎన్ఎస్ జలస్వా నేవి షిప్‌లో సైనికులు ఆదివారం ’బే ఆఫ్ బెంగాల్‘ వద్ద ప్రదర్శన నిర్వహించారు. కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న కరోనా వారియర్స్‌కు ధన్యవాదాలు, ప్రణామాలంటూ సైనికులు తమ మద్దతును తెలిపారు. విశాఖపట్నంలో కరోనా సేవల కోసం ప్రభుత్వం చెస్ట్ ఆస్పత్రిని ఉపయోగిస్తున్నారు. ఈ ఆస్పత్రిలోనూ వాయుసేన హెలికాప్టర్లు పూలవర్షాన్ని కురిపించాయి. వైద్యులకు, నర్సులకు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు నౌకదళం ఇన్‌చార్జి కమాండర్ సంజీవ్ ఇస్సార్ ఫుష్పగుచ్ఛాలు అందించారు.ఆదివారం సాయంత్రం రెండు యుద్ధనౌకల్లో విద్యుత్ దీపాలు వెలిగించి నేవీ సిబ్బంది కరోనా యోధులకు కృతజ్ఞతలు తెలపనున్నారు.

కొవిడ్‌పై పోరాటంలో పాల్గొంటున్న గాంధీ ఆస్పత్రి వైద్యులు, నర్సులు, సిబ్బందికి మద్దతుగా భారత ఎయిర్ పోర్స్ హెలికాప్టర్లు శనివారం పూలవర్షాన్ని కురిపించాయి. ముందుగా నిర్ణయించిన మేరకు ఆస్పత్రి వర్గాలు తమ యూనిఫాంలు ధరించి హాస్పిటల్ ఆవరణకు చేరుకున్నాయి. సుమారు 15 నిమిషాల పాటు హెలికాప్టర్ ద్వారా వైద్య సిబ్బందితో పాటు శానిటేషన్ కార్మికులపైనా పూలవర్షం కురిపించారు. తమకు లభించిన ఈ గుర్తింపుతో వారంతా చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. హకీంపేట ఎయిర్‌పోర్స్ స్టేషన్ తరఫున కెప్టెన్లు కెఎస్.రాజు, పంకజ్ గుప్తా సారథ్యంలో చేపట్టిన కరోనా వారియర్స్‌పై పూలవర్షం విజయవంతంగా చేపట్టారు. రాష్ర్టంలో కరోనా సేవల కోసం గాంధీ ఆస్పత్రిని పూర్తిగా కరోనా సేవల ఆస్పత్రిగా మార్చివేశారు. కరోనా పాజిటివ్ కేసులను మాత్రమే ట్రీట్‌మెంట్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ప్రశంసలు కొవిడ్‌పై పోరాడుతున్న వైద్య, పారిశుధ్య ఇతర సిబ్బందిని
మరింత ఉత్సాహపరిచేందుకు ఉపయోగపడుతాయని గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

Tags: India, telangana,corona, warriors, Doctors, gandhi, sanitation, navy, Air Force, Delhi

Advertisement

Next Story

Most Viewed