బొగ్గు గనిలో భారీగా వరద నీరు.. కోట్ల రూపాయల నష్టం.?

by Sridhar Babu |
adriyala coal mine
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఆసియాలోనే మొదటి సారిగా ప్రారంభించిన అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. భారీగా నీరు వచ్చి చేరడంతో సింగరేణికి రూ. కోట్లు నష్టం వాటిల్లింది. రామగుండం మూడో రీజియన్‌లోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో యంత్రాలు, మోటర్లు నీట మునగడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దీంతో సింగరేణికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. గనిలో 30లక్షల గ్యాలన్ల వరకూ వరద నీరు రావడంతో రూ. 7 కోట్ల విలువ చేసే రోడ్ హెడర్ యంత్రంతో పాటు ఇతరత్రా మిషనరీ అంతా కూడా మునిగిపోయాయి.

సింగరేణి అధికారులు లాంగ్ వాల్ ప్రాజెక్టులో రెస్క్యు ఆపరేషన్ చేపట్టారు. ఈ గనిలో ఏర్పాటు చేసిన మోటార్లు పని చేయకపోవడం వల్లే నీటిని తరలించడంలో ఇబ్బందులు ఏర్పడినట్టు తెలుస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆసియాలోనే మొదటిసారిగా లాంగ్ వాల్ పద్దతిలో బొగ్గును వెలికి తీసే విధానాన్ని అడ్రియాలలో చేపట్టారు. గత నాలుగైదు రోజుల నుంచి గనిలోపల నీటి మట్టం క్రమక్రమంగా పెరగడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బొగ్గు తీస్తుండగా ఊట రూపంలో వచ్చే నీటిని సంపుల్లోకి తరలించి, భారీ మోటార్ల ద్వారా గని ఉపరితలానికి ఎత్తి పోసేందేకు ఏర్పాట్లు చేశారు. అయితే పంపుల్లో టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో వాటర్ లిఫ్ట్ సిస్టం నిలిచిపోయింది. దీంతో బొగ్గును వెలికి తీస్తున్న చోట భారీగా నీరు చేరడంతో బొగ్గు తీసే యంత్రాలు మునిగిపోయాయి.

నీటిని తరలించే మోటార్ల మరమ్మతులకు స్పేర్ పార్ట్స్ దొరక్కపోవడంతో 30 లక్షల గ్యాలన్ల నీరు గనిలోపలకు వచ్చి చేరింది. ఈ గనిలో బొగ్గు ఉత్పత్తితో పాటు గూడ్స్ వ్యాగన్ల లోడింగ్ వరకు.. అంతా సాంకేతిక పరిజ్ఞానంతోనే నిర్వహిస్తుంటారు. ఈ గనిలో ఇప్పటి వరకూ రెండు ప్యానెల్స్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేయగా, కొత్తగా 3.5 మిలియన్ టన్నుల ఉత్పత్తే లక్ష్యంగా మూడో ప్యానల్‌ను ప్రారంభించారు. ఇటీవల ఇదే గనిలో విషవాయువులు వెలువడటంతో బొగ్గు ఉత్పత్తి నిలిపివేశారు. కొద్ది రోజుల క్రితమే తిరిగి బొగ్గును వెలికి తీసేందుకు సమాయత్తం కాగా.. తాజాగా గనిలోపల భారీగా వచ్చి చేరిన నీరు ప్రొడక్షన్‌కు ఆటంకంగా మారింది.

రోడ్ హెడర్ యంత్రంతో జె.ఎం.ఎస్ కంపెనీ గనిలోని నాల్గొవ ప్యానల్‌లో 6 మీటర్ల వరకు రోడ్ వే చేస్తూ వెళ్తుంది. ఈ మిషనరీ అంతా కూడా నీట మునిగి పోవడం గమనార్హం. ఈ ఘటనతో మొత్తంగా రూ. 10 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లుగా అంచనా వేస్తున్నారు. గనిలో నీరు అలాగే నిలువ ఉన్నట్టయితే నష్టం మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎస్ 4, ఎస్ 5 డిప్‌ల వద్ద సుమారు 150 కోట్ల విలువ చేసే బోల్టర్ మెషీన్‌తో పాటు ఫీడర్ బ్రేకర్, షటిల్ కార్, ఎల్డీఎఫ్ లోడ్ సెంటర్ యంత్రాలు కూడా ప్రమాద అంచున ఉన్నట్టుగా తెలుస్తోంది. లాంగ్ వాల్ ప్రాజెక్ట్‌లో నెలకొన్న పరిస్థితులను బట్టి గమనిస్తే ఇప్పట్లో నీటిని తరలించే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.

Advertisement

Next Story