- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరిహారం కోసం ప్రదక్షిణలు
దిశ, తెలంగాణ బ్యూరో: వరద ముంపు బాధితుల గోడు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని తాకింది. నష్టం నుంచి ఉపశమనం కోసం ప్రభుత్వం తక్షణ సాయాన్ని ప్రకటించి.. అర్ధాంతరంగా నిలిపివేయగా బాధితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. దీంతో వెనక్కి తగ్గి అందరికీ పరిహారం అందిస్తామని మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు. అయితే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టు ప్రకటించినా.. ఎప్పటి నుంచి మొదలు పెడతారో చెప్పలేదు. దీంతో పరిహారం కోసం వరద బాధితులు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రేపో, మాపో మొదలవుతుందని, కేటీఆర్ సారే చెప్తారంటూ కార్పొరేటర్లు తప్పించుకు తిరుగతున్నారు. ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టతనివ్వలేదు.
ఈ నిర్ణయంతో ఊహించని విధంగా గ్రేటర్‌లోని ముంపు బాధితులంతా రోడ్లమీదకు వచ్చారు. దీంతో వెనక్కి తగ్గిన మంత్రి కేటీఆర్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, బాధితులందరికీ సాయాన్ని అందిస్తామని గత శనివారం స్పష్టం చేశారు. అయితే సాయం అందజేతను ఎప్పటి నుంచి ప్రారంభిస్తామనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. దీంతో వరద బాధితులు సాయం ఎప్పుడిస్తారో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారు.
బల్దియా ప్రధాన కార్యాలయానికి బాధితులు..
వరద బాధితులకు తక్షణ సాయం కోసం రూ.550 కోట్లను రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కేటాయించింది. గ్రేటర్ పరిధిలోని 3.87 లక్షల మందికి రూ.387 కోట్లను అందించినట్టు వెల్లడించింది. ముందస్తు అంచనా ప్రకారం 5 లక్షల మందికి ఈ సాయం అందాల్సి ఉంది. వరద సాయం కార్యక్రమం నిధులు పక్కదోవ పడుతున్నాయని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని నిలిపేస్తున్నట్టుగా మున్సిపల్ శాఖ ప్రకటించింది. వరద సాయం కార్యక్రమం నిలిపివేసిన క్రమంలో జీహెచ్ఎంసీ సర్కిల్, జోనల్ కార్యాలయాల ఎదుట ప్రజలు ఆందోళనలు చేశారు. అప్పటికే సుమారు 4 లక్షల మందికి సాయం అందించినట్టు జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు.
అయితే తాము నిజమైన బాధితులమని దాదాపు రెండు లక్షల మంది రోడ్డునెక్కినట్లు అంచనా. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. వరద సాయం కార్యక్రమాన్ని కొనసాగిస్తామని మంత్రి ప్రకటించి నాలుగు రోజులు దాటినా ఏ ఒక్కరికీ సాయం అందించంలేదు. ఈ క్రమంలో మంగళవారం పాతబస్తీకి చెందిన కొందరు మహిళలు నేరుగా జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. వరద సాయం ఎవరు ఇస్తున్నారు ? ఎక్కడ ఇస్తున్నారు ? అంటూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. తమ ఇండ్లు వరదల్లో చిక్కుకుపోయి నష్టపోయామని, సాయం అందించాలని కోరారు. వారికి సంబంధించిన ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్ పత్రాలను సైతం వెంట తీసుకొచ్చి సిటీజన్ సర్వీస్ సెంటర్‌లో ఇచ్చారు. మంత్రి ప్రకటించిన మాట వాస్తవమే అయినా.. ఎప్పటి నుంచి సాయం అందించాలని ఆదేశాలు ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. నష్టపోయిన తమకు కాకుండా టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు పంచుకోవాలంటూ మంత్రి ఆర్డర్స్ ఇచ్చారా అంటూ ఓ మహిళా ఘాటుగానే స్పందించారు. ఇండ్లు మునిగిపోయింది తమవైతే పరిహారం వేరొకరికి ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొహం చాటేస్తున్న కార్పొరేటర్లు..
వరద సాయం పక్కదోవ పట్టించడంలో కీలక పాత్ర పోషించిన కార్పొరేటర్లకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అప్పట్లోనే ప్రజలందరూ వారి ఇళ్లను చుట్టుముట్టి నిరసన తెలిపారు. ఇప్పుడు మంత్రి చెప్పినా తమకు డబ్బులు ఇవ్వరా అంటూ నిలదీస్తున్నారు. సాయం పంపిణీని ఎప్పుడు మొదలు పెడతారంటూ ప్రజలు అడిగితే రేపు, మాపు అంటూ సమాధానాలు చెబుతూ తప్పించుకుంటూ తిరుగుతున్నారు. ప్రజల నుంచి గతంలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేరని సికింద్రాబాద్ జోన్ పరిధిలోని ఓ కార్పొరేటర్ చెబుతున్నారు. కేటీఆర్‌కు సూచనప్రాయంగా కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లేవారు అధికార పార్టీలో లేకపోవడంతో ఆయన మనసుకు వచ్చినప్పుడే కార్యక్రమం కొనసాగనుంది. వరదల నేపథ్యంలో మూసారాంబాగ్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలందరిని ఖాళీ చేయించారు.మూసారాంబాగ్, ఆగపురా, కమలా నగర్, పటేల్ నగర్, టోలి చౌకీ, ఎల్‌బీ నగర్ ప్రాంతాల్లోని ప్రజలకు పరిహారం అందలేదు. అయితే బుధవారం నుంచి పరిహారం కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.