గ్రేటర్​లో ఇప్పుడిదే హాట్​ టాపిక్​

by Anukaran |
గ్రేటర్​లో ఇప్పుడిదే హాట్​ టాపిక్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్​ ఎన్నికల్లో అనధికారికంగా ఓట్ల కొనుగోళ్లు మొదలయ్యాయి. గత నెలలో కురిసిన వానలతోనే రాజకీయ చక్రం తిరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల మధ్య వరద సాయం అంశం హాట్ టాపిక్‌గా మారింది. వరద బాధితులకు ఇప్పుడు ఇచ్చిన సాయాన్ని ఎన్నికల తర్వాత కొనసాగిస్తామని టీఆర్​ఎస్​ ప్రకటించగా.. బీజేపీ దాన్ని రెట్టింపు చేసింది. ఒక విధంగా ఓట్ల కొనుగోలుకు టెండర్​ పాడినట్లుగా మారిందని ప్రచారం జరుగుతోంది.

ఎన్నికల తర్వాత కొనసాగిస్తాం..

అధికార పార్టీకి వరద సాయం చాలా తలనొప్పులు తెచ్చి పెట్టింది. ఇప్పటి వరకు రూ.667 కోట్లు పంపిణీ చేసినట్లుగా ప్రకటించారు. అయితే దీనిలో చాలా మేరకు పక్కదారి పట్టిందనే ఆరోపణలున్నాయి. వరద సాయాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు కూడా చేసింది. ఎన్నికల వేళ ఓట్లను రాబట్టుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ నగదు రూపంలో ఇచ్చే పద్ధతిని మార్చింది. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

అయితే లక్షలాది దరఖాస్తులు రావడం, ఇంకా బాధితుల సంఖ్య పెరుగుతుండటం, కేంద్రాల దగ్గర భారీ లైన్లలో ఉండటంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయని భావించి ఉన్నపళంగా బ్రేక్​ వేయించారు. దీంతో బాధితుల నుంచి విమర్శలు పదునెక్కాయి. ఈ నోట్ల పథకం ఓట్లుగా మారుతాయనుకుంటే పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెట్టింది. దీంతో వరద సాయాన్ని ఎన్నికల తర్వాత కొనసాగిస్తామంటూ ప్రకటించింది. వచ్చేనెల 4న గ్రేటర్​ లెక్కింపు తర్వాత రోజు నుంచే యథావిధిగా కొనసాగిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు, బద్నాం నుంచి తప్పించుకునేందుకు ఈ ప్రకటన చేశారని తెలుస్తోంది.

ఇచ్చింది టీఆర్ఎస్సే..

ఇక వరదసాయాన్ని ఓట్ల రూపంలో మల్చుకునేందుకు గులాబీ శ్రేణులు ప్రచారంలో ప్రధానాస్త్రంగా వాడుకుంటున్నాయి. వరద సాయాన్ని మేమే ఇప్పించామని, టీఆర్​ఎస్​కు ఓటేస్తేనే ఇంకా మిగిలిన వారికి సాయం అందిస్తామంటూ చెప్పుకుంటున్నారు. కొన్నిచోట్ల తమకు రాలేదని వ్యతిరేకత ఎదురవుతుండటంతో గ్రేటర్​ ఎన్నికల తర్వాత ఇప్పిస్తామంటూ బతిమిలాడుతున్నారు. కొంతమంది అభ్యర్థులు దరఖాస్తుదారుల రశీదులు తీసుకుని హామీ ఇస్తున్నారు. బస్తీలు, కాలనీల వారీగా తమ అనుచరులతో మీసేవ రశీదులు తీసుకుని వారికి ఇప్పిస్తామంటూ హమీ ఇస్తున్నారు.

రూ.20 వేలు ఇస్తాం : బీజేపీ

వరద సాయం అంశం కీలకంగా మారడం, టీఆర్​ఎస్​ పార్టీ మొత్తం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్​ చేయడంతో గ్రేటర్​ ఎన్నికల్లో బీజేపీ స్టాండ్​ మార్చింది. వరద సాయంలో బీజేపీ నేతలు ఏం చేయడం లేదని, కేంద్రం నుంచి రూపాయి రాలేదని సీఎం కేసీఆర్​ నుంచి కిందిస్థాయి నేతల వరకు ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో వరదసాయాన్ని రెండింతలు చేసి బాధితులకు ఇస్తామంటూ బీజేపీ గురువారం ప్రకటించింది. ఈ ప్రకటన కేంద్రమంత్రి హోదాలో కిషన్​రెడ్డి చేయకుండా ఎంపీ, పార్టీ చీఫ్​ బండి సంజయ్​తో వెల్లడించారు. గ్రేటర్​ ఎన్నికల ప్రక్రియ ముగియగానే.. బీజేపీ అధికారంలోకి వస్తే వరద బాధితులకు రూ.20 వేల చొప్పున పంపిణీ చేస్తామంటూ ప్రకటించడం నగరంలో హాట్​ టాపిక్​గా మారింది. దీనిపై గులాబీ నేతలు ఇంకా కౌంటర్​ ఇవ్వలేదు.

ఓట్లను కొనడమేనా..?

గ్రేటర్​ ఎన్నికల వేళ గంపగుత్తగా ఓట్లను బహిరంగంగా కొంటున్నారనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రం, కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ రెండు పార్టీలు వరదసాయం ముసుగులో ఓట్లను టెండర్లు పాడినట్టుగా కొనుగోలు చేస్తున్నాయంటున్నారు. ఇది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని, దీనిపై ప్రచారాలను నిలిపివేయాలని పలువురు ఇప్పటికే ఎస్​ఈసీకి ఫిర్యాదు చేశారు. కానీ దీనిపై ఎస్​ఈసీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

Advertisement

Next Story

Most Viewed