ఉత్కంఠంగా చిట్యాల ఎన్నిక.. అధ్యక్ష బరిలో ఐదుగురు నాయకులు

by Shyam |   ( Updated:2021-09-18 22:54:49.0  )
TRS Leaders
X

దిశ, చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. రేసులో ఐదుగురు ముఖ్య నాయకులు పోటీ పడుతున్నారు. ఆశావహులు ఎవరికి వారే అధిష్టానం తనకు అనుకూలంగా ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరిలో అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుందో అని ఉత్కంఠ నెలకొంది. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జి సిరికొండ మధుసూదనాచారి తన అనుచరులను మండల అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. 2018లో జరిగిన ఎన్నికల్లో సిరికొండ మధుసూదనాచారి ఓడిపోవడం, కాంగ్రెస్‌ నుంచి గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి అనూహ్యంగా టీఆర్‌ఎస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోవడం, ఆయన సతీమణి గండ్ర జ్యోతి వరంగల్‌ రూరల్‌ జిల్లా జెడ్పీచైర్‌పర్సన్‌గా ఎంపిక కావడంతో పరిస్థితి మారింది.

ఇటీవలే టీఆర్‌ఎస్‌ పార్టీ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. కొన్ని గ్రామాల్లో వర్గవిభేదాలు కూడా బయటపడటంతో మండల అధ్యక్ష పదవి ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మండల అధ్యక్ష బరిలో ఐదుగురు బడా నాయకులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో చిట్యాల మండల కేంద్రానికి చెందిన కట్కూరి నరేందర్, ఆరేపల్లి మల్లయ్య, చింతల రమేష్, గోపాలపూర్‌కు చెందిన ఎరుకొండ గణపతి, గుంటూరుపల్లికి చెందిన పువ్వాటి వెంకటేశ్వర్లు బరిలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

మండల కేంద్రం నుంచి ముగ్గురు పోటీ?

అయితే.. గతంలో ఎన్నడూ మండల కేంద్రానికి చెందిన వ్యక్తులకు అధ్యక్ష పదవి కేటాయించలేదని ప్రస్తుతం ఆ దిశగా అడుగులు పడాలని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంట్లో చిట్యాలకు చెందిన కట్కూరి నరేందర్ విద్యార్థి దశ నుంచి టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. కొన్నాళ్లు యూత్ అధ్యక్షుడిగా సేవలందించిన ఆయన ఎమ్మెల్యే గండ్ర పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీలో చేరి నమ్మిన బంటుగా గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశాడు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో ఆయనకు టీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన సతీమణి పద్మను ఎంపీటీసీ బరిలో ఇండిపెండెంట్‌గా నిలిపి భారీ మెజార్టీతో గెలుపొందారు. అనంతరం ఎంపీపీ పదవి కోసం తీవ్రంగా కృషి చేసి అధిష్టానం ఆదేశం మేరకు బరిలో నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఆయన పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా, టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మండల అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నుంచి ఆరపెల్లి మల్లయ్య, చింతల రమేష్, పువ్వాటి వెంకటేశ్వర్లు సైతం గట్టి పోటీని ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు

టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్ష పదవి రేసులో ఉన్న నాయకులు తమకే పదవి కట్టబెట్టాలని ఇప్పటి నుంచే అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఏ నాయకుడికీ అధ్యక్ష పదవి ఇప్పిస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భరోసా ఇవ్వలేదు. కాగా, చిట్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ‘‘కేసీఆర్ చెప్పినా నేను చెప్పినా ఒక్కటే. నా నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించవద్దు.’’ అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే అధ్యక్ష పదవి డిసైడ్ అయినట్లు వినికిడి. మరోవైపు నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టకాలంలో కూడా తన వెంట ఉన్న పార్టీ నాయకులకే ప్రాధాన్యత ఇస్తారని తోటి కార్యకర్తలు బాహాటంగా చర్చించుకోవడం గమనార్హం. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని నమ్ముకున్న నాయకుల్లో ఎవరికి అధ్యక్ష పదవి కట్టబెడతారో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed