పోలీస్ క్యాంపు వద్ద కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి

by Sridhar Babu |
Silger‌ Police Camp
X

దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా సిల్గేర్ సీఆర్పీఎఫ్ పోలీస్ క్యాంపు వద్ద సోమవారం ఉదయం కాల్పులు కలకలం రేగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. మృతులు మావోయిస్టు మిలీషియా సభ్యులుగా పోలీసుల ప్రకటన విడుదల చేశారు. వివరాళ్లోకి వెళితే.. మావోయిస్టుల నిర్మూలనలో భాగంగా ఇటీవల బీజాపూర్ జిల్లా సిల్గేర్‌లో కొత్తగా సీఆర్పీఎఫ్ పోలీసులు క్యాంపు ఏర్పాటు చేశారు. దీంతో ఈ పోలీస్ శిబిరాన్ని ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ గత నాలుగైదు రోజులుగా ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్యాంపు ఎదుట నిరసన వ్యక్తం చేస్తుండగా, పోలీసులు వారికి నచ్చజెప్పి పంపిస్తున్నారు. రోజుమాదిరిగానే సోమవారం కూడా భారీగా ఆదివాసీలు తరలివచ్చారు.‌

క్యాంపు ముందు రక్షణ వలయంగా ఏర్పాటు చేసిన ఇనుప కంచెను దాటి క్యాంపు వైపు దూసుకొస్తుండగా పోలీసులు అడ్డుకొన్నారు. ఆ క్రమంలోనే ఫైరింగ్ చోటుచేసుకున్నట్లు సమాచారం. గ్రామస్థుల గుంపులో నుంచి పోలీసుల వైపు కాల్పులు ప్రారంభించగా, ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. జేగురుగొండ ఏరియా కమిటీ నక్సల్స్ ఈ దాడిలో పాల్గొన్నట్లు భావిస్తున్నారు. పోలీస్ క్యాంపు ఎత్తివేయాలని గ్రామస్తుల(ఆదివాసీల) మీద వత్తిడి తెచ్చిన నక్సల్స్ ఆదివాసీలతో కలిసివచ్చి పోలీసులపై దాడికి ప్రయత్నించగా తిప్పికొట్టినట్లు తెలిపారు. క్యాంపు ఏర్పాటును జీర్ణించుకోలేక గ్రామస్తులను రెచ్చగొడుతున్నారని వెల్లడించారు.

Advertisement

Next Story