కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..11మంది మిస్సింగ్

by Sumithra |
కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..11మంది మిస్సింగ్
X

దిశ, కుత్బుల్లాపూర్ : కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఓ వ్యక్తి దూలపల్లి రోడ్డులోని ఓపెన్ ప్లాట్‌లో భారీ షెడ్డు ఏర్పాటుచేసి మహాలక్ష్మి కెమికల్స్ పేరుతో ప్రమాదకర రసాయనాల దందా సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే పనులు చేస్తుండగా కెమికల్స్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి కాస్త ఒక్కొక్కటిగా అన్ని డ్రమ్ముల్లోని రసాయనాలకు అంటుకోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన అగ్ని కిలలు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగాయి.

పేట్ బషీరాబాద్ పోలీసులు, అగ్నిమాపక అధికారులు సమన్వయంతో పని చేయడం వల్ల మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఓ వ్యక్తి గాయాల పాలై బయటకు పరుగులు తీసినట్లు సమాచారం. అతన్ని గుర్తించిన స్థానికులు ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి తరలించారు. ప్రతిరోజూ ఆ గోదాములో 10 నుంచి 12 మంది పని చేస్తారని స్థానికులు తెలియజేస్తున్నారు. కాగా, ఒకరు మాత్రమే బయటకు వచ్చారని మిగతా 11 మంది అందులోనే ఉన్నారా? లేక తప్పించుకుని పారిపోయారా..? అనేది తెలియడం లేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story