కేంద్ర మంత్రిపై ఎఫ్ఐఆర్

by Shamantha N |
కేంద్ర మంత్రిపై ఎఫ్ఐఆర్
X

న్యూఢిల్లీ: రాజస్థాన్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. అశోక్ గెహ్లాట్ సర్కారు కూల్చే కుట్ర అభియోగాల కింద కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు చేయగా, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ వాదనలను బలపరుస్తూ ఆడియో టేపుల ఆధారాలున్నాయని వాదించింది. కాగా, సచిన్ పైలట్‌తోపాటు మరో 18మంది ఎమ్మెల్యేలకు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన అనర్హత వేటు నోటీసులపై హైకోర్టులో ఊరట లభించింది. కుట్ర కేసులో రెబల్ ఎమ్మెల్యేలపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో సచిన్ వర్గీయులుంటున్న హర్యానాలోని మనేసర్ పట్టణ హోటల్‌కు రాజస్థాన్ పోలీసులు వెళ్లారు. వీరిని హర్యానా పోలీసులు ఆపడంతో హైడ్రామా ఏర్పడింది.

తెరమీదకు ఆడియో టేపులు..

బీజేపీ, రెబల్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ తన ఆరోపణలను మరింత ఉధృతం చేసింది. కేంద్ర మంత్రి(జల్ శక్తి) గజేంద్రసింగ్ షెకావత్, బిజినెస్‌మ్యాన్, బీజేపీ నేత సంజయ్ జైన్, రెబల్ ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్ శర్మలు అశోక్ గెహ్లాట్ సర్కారు కూల్చేందుకు కుట్ర పన్నారని, అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు. గురువారం రాత్రి రెండు ఆడియోటేపులు ముందుకు వచ్చాయని, అందులో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సంజయ్ జైన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ సంభాషణలున్నాయని సూర్జేవాలా తెలిపారు. ఆ సంభాషణ వింటే గెహ్లాట్ సర్కారును కూల్చే కుట్ర చేశారని స్పష్టం తెలుస్తున్నదని, ప్రజాస్వామ్యంలో ఇదో చీకటి ఘట్టం అని పేర్కొన్నారు. వీరి ముగ్గురిపై రాజస్థాన్ స్పెషల్ గ్రూప్ ఆపరేషన్(ఎస్‌వోజీ) పోలీసులు కేసు నమోదు చేయాలని, షెకావత్ ఒకవేళ కేంద్రమంత్రి పదవిని దుర్వినియోగపరుస్తూ దర్యాప్తును ఆటంకపరిస్తే వారంట్ తీసుకుని అరెస్టు చేయాలని తెలిపారు. ఈ విషయమై ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌ల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సుర్జేవాలా ఆరోపణల తర్వాత ఎస్‌వోజీ పోలీసులు దేశద్రోహ చట్టం కింద సహా రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదుచేశారు.

మద్దతు ఉపసంహరించడానికి ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగారన్న కాంగ్రెస్ ఆరోపణలను కేంద్రమంత్రి కొట్టిపారేశారు. ఆ ఆడియో టేపుల్లోని వాయిస్ తనది కాదని, వారు మాట్లాడే సంజయ్ జైన్ ఎవరో తనకు తెలియదని గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. అలాంటి పేరుతో తనకు చాలా మంది తెలుసని, వారు చెప్పేవ్యక్తితో మాట్లాడినట్టయితే తన నెంబర్ ఉండాలి కదా అని తెలిపారు. కాంగ్రెస్ దర్యాప్తు చేసుకోవచ్చునని, అవసరమైతే విచారణకు పిలిచినా తప్పకుండా హాజరవుతారని అన్నారు. భన్వర్‌లాల్‌ శర్మ కూడా కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆడియో టేపుల్లోని వాయిస్ తనది కాదని తెలిపారు.

రెబల్స్‌పై చర్యలొద్దు: హైకోర్టు

పార్టీ విప్‌ను ఉల్లంఘిస్తూ రెండు శాసనసభాపక్ష సమావేశాలకు గైర్హాజరైన 19 మంది రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని అశోక్ గెహ్లాట్ సర్కారు అభ్యర్థన మేరకు అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి నోటీసులు జారీచేశారు. శుక్రవారంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై శుక్రవారం సాయంత్రం ఆయన చర్యలు తీసుకునేవారు. అయితే, నోటీసులందగానే పైలట్ వర్గం రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించింది. పైలట్ వర్గం పిటిషన్‌ను డివిజన్ బెంచ్ విచారిస్తూ మంగళవారం 5.30 గంటల వరకు రెబల్స్‌పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై విచారణను సోమవారం ఉదయానికి వాయిదా వేసింది.

చిదంబర సలహా

అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబావుటా ఎగరేసినప్పటి నుంచి తొలిసారిగా కాంగ్రెస్ ఓ టాప్ నేతతో మాట్లాడినట్టు స్పష్టమైన వార్త శుక్రవారం బయటికొచ్చింది. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంతో సచిన్ మాట్లాడి, సలహా అడిగినట్టు ఆయన ధ్రువీకరించారు. సచిన్ తనతో మాట్లాడారని, సలహా అడగ్గా ఇచ్చానని చిదంబరం తెలిపారు. గురువారం సచిన్ తనకు ఫోన్ చేసినట్టు వివరించారు. కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చిన అవకాశాన్నే పునరుద్ఘాటించారని చెప్పారు. బహిరంగంగా అతన్ని ఆహ్వానించిన నాయకత్వం ఏ సమస్యైనా తనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నదని చెప్పినట్టు వివరించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సలహా ఇచ్చినట్టు వెల్లడించారు. చిదంబరంతోపాటు కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ వాద్రా కూడా బుధవారం సాయంత్రం సచిన్‌తో మాట్లాడినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story